అయ్య బాబోయ్​ 18 ఏళ్లుగా ఆ బట్టలు వాష్ చేయలేదట.. ఇదెలా సాధ్యం...

అయ్య బాబోయ్​ 18 ఏళ్లుగా ఆ బట్టలు వాష్ చేయలేదట.. ఇదెలా సాధ్యం...

జీన్స్ ధరించే వారు ఒకట్రెండు సార్లు వేసుకున్న తర్వాత కచ్చితంగా వాటిని వాష్ చేస్తారు. కానీ ఓ మహిళ మాత్రం 18 ఏళ్లుగా తన రెండు జీన్స్‌ ప్యాంట్లను ఉతకలేదట. ఆపై అవి ఇంకా కొత్త వాటిలాగే ఉన్నాయని చెబుతోంది. కొన్నప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు అలాగే ఉన్నాయంటోంది. దీంతో సోషల్‌ మీడియాలో దీనిపై పెద్ద చర్చ మొదలైంది.

ఏడాదికి ఒక్కసారే..

ఇంగ్లాండ్‌ యార్క్‌షైర్‌కు చెందిన సాండ్రా విల్లిస్ అనే మహిళ  18 ఏళ్ల క్రితం ఓ జత ఎంఎస్ డెనిమ్ జీన్స్ ప్యాంట్లను కొనుగులు చేసింది. అయితే ఏడాదికి ఒక్కసారి మాత్రమే వాటిని ధరిస్తోందట. వాటిపై ఒక్క మరక కూడా లేకపోవడంతో వాష్ చేయాలనిపించడం లేదట. ఈమె సెంటు బాగా వాడటంతో జీన్స్ కూడా చెమట వాసన రావడం లేదట. ఇక ఎందుకు ఉతకడం అనుకుని వాటిని అలాగే ఉంచుతోంది.

ఇంకా రెండేళ్లు నో వాషింగ్​

దీంతో ఆ జీన్స్ ప్యాంట్లు చెక్కు చెదరకుండా అలాగే కొత్తగా ఉన్నాయని చెబుతోంది సాండ్రా. ఇంకో రెండేళ్లు కూడా వాటిని ఉతకనంటోంది. 20 ఏళ్లు జీన్స్ ఉతకకుండా రికార్డు సృష్టించాలనుకుంటోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.  జీన్స్ ప్యాంట్‌ను ఉతక్కుండా 20 సార్లు వేసుకుంటారా? నేనైతే ఒకట్రెండు సార్లు ధరిస్తే వెంటనే వాష్ చేస్తా.. అని పలువురు నెటిజన్లు అంటున్నారు. అసలు మీరు జీన్స్‌ను ఎందుకు ఉతకడం లేదు? అని మరో యూజర్ ప్రశ్నించాడు. దీనికి సాండ్రా బదులిస్తూ.. తాను జీన్స్‌ను ఉతకకపోయినప్పటికీ వాటిని శుభ్రంగా తుడుస్తానని చెప్పారు. అందుకే అవి కొత్తగా ఉన్నాయని పేర్కొన్నారు. నిజంగా వాటిని ఉతకాలని అన్పించినప్పుడు వాష్ చేస్తానని చెప్పుకొచ్చారు.

మరకలు పడితే ఉతుకుతా..

అంతే కాదు తన వద్ద చాలా జతల జీన్స్ ఉన్నాయని, అందుకే వీటిని ఏడాదికి ఒక్కసారే ధరించినట్లు వివరించారు. వాటిపై ఏమైనా మరకలు పడితే అప్పుడు కచ్చితంగా వెంటనే వాష్ చేస్తానన్నారు. ఇప్పుడు మాత్రం అవి చాలా కొత్తగానే ఉన్నాయన్నారు.