
గువాహతి: దశాబ్దాల కల.. కోట్లాది అభిమానుల ఆశ.. సొంతగడ్డపై అద్భుతం చేయాలనే తపన నడుమ ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ వన్డే వరల్డ్ కప్‌వేటకు సిద్ధమైంది. 47 ఏండ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న వరల్డ్ కప్ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా ముద్దాడాలని హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని జట్టు పట్టుదలగా ఉంది. మంగళవారం శ్రీలంకతో జరిగే తొలి మ్యాచ్‌తో తమ ప్రస్థానాన్ని ఆరంభించనుంది. 12 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో హోమ్ అడ్వాంటేజ్‌ను సద్వినియోగం చేసుకోవాలని హర్మన్‌సేన భావిస్తోంది.
ఈ మెగా టోర్నీలో ఎనిమిది టాప్‌టీమ్స్.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ బరిలో నిలిచాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే టోర్నీలో ప్రతీ టీమ్ మిగతా ఏడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్–4 టీమ్స్ సెమీస్ చేరుతాయి. ఇండియాలోని నాలుగు సిటీలతో పాటు, కొలంబోలో కొన్ని మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్5న ఇండియాతో హై ఓల్టేజ్ పోరుతో పాటు పాకిస్తాన్ తమ అన్ని మ్యాచ్‌లను కొలంబోలో ఆడనుంది. ఈ ఎడిషన్‌కు రూ. 115 కోట్ల రికార్డు స్థాయి ప్రైజ్‌మనీ ఉంది.
బ్యాటింగ్ స్ట్రాంగ్.. బౌలింగ్‌తోనే టెన్షన్..!
హోమ్‌గ్రౌండ్‌లో ఆడటం ఇండియాకు అతి పెద్ద బలం. ఇటీవలే ఇంగ్లండ్‌పై వన్డే, టీ20 సిరీస్‌లను గెలవడం, బలమైన ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో గట్టి పోటీ ఇవ్వడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బ్యాటింగ్ పవర్ టీమ్‌కు ప్లస్ పాయింట్. ఈ ఏడాది నాలుగు వన్డే సెంచరీలు కొట్టిన వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన కెరీర్ బెస్ట్‌ఫామ్‌లో ఉంది. ఆమెకు యంగ్ ఓపెనర్ ప్రతీక రావల్ గొప్ప సపోర్ట్ ఇస్తోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పెద్ద టోర్నీల్లో చెలరేగి ఆడుతుంది.
జెమీమా రోడ్రిగ్స్, మిడిలార్డర్లో రిచా ఘోష్, హర్లీన్ డియోల్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మతో బ్యాటింగ్ డెప్త్ బాగుంది. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన రేణుకా సింగ్ పేస్ దాడికి నేతృత్వం వహించనుండగా.. 22 ఏండ్ల యంగ్ సెన్సేషన్ క్రాంతి గౌడ్ తన పేస్, యార్కర్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగలదు. స్పిన్‌కు అనుకూలించే లోకల్ పిచ్‌లపై దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ్ రాణా, శ్రీ చరణిపై సహజంగానే భారీ అంచనాలున్నాయి. అయితే, బౌలర్లు తరచూ భారీ స్కోర్లు ఇచ్చుకోవడం ప్రతీకూలాంశం.
అలాగే, వామప్ మ్యాచ్‌లో అరుంధతి రెడ్డి గాయపడటం, అమన్‌జోత్ కూడా గాయం నుంచి ఇప్పుడే కోలుకోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. వీటితో పాటు కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురై ఓడిపోవడం ఇండియా వీక్‌నెస్. 2005, 2017 వన్డే వరల్డ్ కప్, 2020 టీ20 కప్ ఫైనల్స్‌తో పాటు 2022 కామన్వెల్త్ గేమ్స్ తుదిమెట్టుపై ఇండియా బోల్తా పడింది. ఆ వీక్‌నెస్ నుంచి బయట పడితేనే హర్మన్‌సేన తన కలను నెరవేర్చుకోగలదు.
ఆసీస్ అడ్డు దాటితేనే..
హోమ్ టీమ్‌గా ఇండియా ఫేవరెట్ అయితే.. డిఫెండింగ్ చాంప్ హోదాలో ఎనిమిదో టైటిల్ కోసం బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా మరోసారి హాట్ ఫేవరెట్‌గా ఉంది. ఆ టీమ్ నిండా మ్యాచ్ విన్నర్లే. కంగారూల అడ్డుదాటితేనే ఇండియా తన టార్గెట్‌ను చేరుకోగలదు. గతేడాది టీ20 వరల్డ్ కప్ నెగ్గిన న్యూజిలాండ్ తో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఇటీవలి కాలంలో అద్భుత ఆటతో టైటిల్ రేసులో ఉన్నాయి. లంకనూ తక్కువ అంచనా వేయలేం.