పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి దయనీయం

పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి దయనీయం

తెలంగాణ  రాష్ట్రంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైనా ఉంటే అది ముందుగా పేర్కొనేది గ్రామ పంచాయతీ  కార్యదర్శి  ఉద్యోగం. గ్రామ పంచాయతీ  కార్యదర్శి ఉద్యోగం చేయాలంటేనే హడలిపోయే స్థితి  తెలంగాణలో ఏర్పడింది. పంచాయతీ రాజ్ చట్టం 2018 గ్రామ పంచాయతీ కార్యదర్శిని బానిస కంటే హీనంగా మార్చివేసినది. యాభైకి పైగా విధులు చట్టంలో కార్యదర్శికి కేటాయించబడ్డాయి. యాభైకి పైగా పంచాయతీ రిజిస్టరుల నిర్వహణ బాధ్యతలు అప్పగించబడ్డాయి. పంచాయతీరాజ్ చట్టంలో గ్రామ కార్యదర్శికి కేటాయించిన విధులలో అత్యధిక శాతం విధులు ఆర్థిక అంశాలతో ముడిపడినవి. కానీ, చట్టంలో గ్రామ కార్యదర్శికి ఎటువంటి ఆర్థికపరమైన చెక్​పవర్ ఇవ్వలేదు.

మండల్ పరిషత్​ కార్యాలయ అధికారులు, జిల్లా పంచాయతీ  అధికారులు గ్రామ పంచాయతీలో ప్రతి ఆర్థిక పరమైన పనుల నిర్వహణలో గ్రామ కార్యదర్శులపైన ఒత్తిడి చేసి.. పనులు చేయకపోతే సస్పెన్షన్, షోకాజ్​ అని బెదిరింపులకు గురి చేస్తూ పనులను చేయిస్తున్నారు. గ్రామ కార్యదర్శికి వచ్చే ప్రతి నెల జీతంలో సగానికి పైగా వేతనాన్ని గ్రామ పంచాయతీ నిర్వహణలో ఖర్చులు చేస్తూ అంత్యంత దయనీయ స్థితికి దిగజారిపోయారు. గ్రామ పంచాయతీలలో సర్పంచుల పదవి ముగిసినప్పటి నుంచి  పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీ ఆర్థిక భారం మొత్తం వారి భుజస్కంధాలపై పడినది. గ్రామ పంచాయతీలో పలు నెలల నుంచి నిధులు లేకపోయినప్పటికీ కార్యదర్శులు అప్పులు చేస్తూ పంచాయతీల ఆర్థిక భారాన్ని మోస్తూ విధులు నిర్వహిస్తున్నారు. చిన్న గ్రామ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మరింత దారుణం.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులలో తొంబై శాతం పైగా గ్రామ కార్యదర్శులు అప్పుల పాలై దారుణ స్థితిలో విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పంచాయతీ రాజ్ చట్టం తెచ్చి పంచాయతీ కార్యదర్శులకు మోయలేని భారమైన విధులు కేటాయించారు. పని ఒత్తిడి వల్ల ఇప్పటి వరకు 42మంది కార్యదర్శులు మరణించారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం వారు మేల్కొని పంచాయతీ రాజ్ చట్టంను సవరించి కార్యదర్శి పని భారం తగ్గించి, ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీలకు ప్రతి నెల నిధులు విడుదల  చేయాలి. 
- మొహమ్మద్, ఖమ్మం జిల్లా, తెలంగాణ  గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం