జనన,మరణాల్లో.. మగవాళ్లే టాప్

జనన,మరణాల్లో.. మగవాళ్లే టాప్
  • జననంలో మహిళల కంటే 8 శాతం ఎక్కువ
  • మరణాల్లో 16 శాతం ఎక్కువ

యాదాద్రి, వెలుగు: జననాల్లోనే కాదు.. మరణాల్లోనూ పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఆడపిల్లలు వద్దనుకుని అబార్షన్లు చేయిస్తుండడంతో మగపిల్లల జననాలు పెరుగుతున్నాయి. మగవాళ్ల మాదిరిగానే ఆడవాళ్లకు అనారోగ్య సమస్యలూ ఉన్నాయి. అయినా మరణాల్లో మగవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. హెల్త్​ డిపార్ట్​మెంట్​ నమోదు చేసిన లెక్కల ప్రకారం ఏటా మగ శిశువుల సంఖ్య పెరుగుతూ ఉంది. మరణాల్లోనూ ఏటా మగవాళ్ల సంఖ్య పెరుగుతున్నట్టు తేలింది. 

జనాభా లెక్కల ప్రకారం..

2011 జనాభా లెక్కల ప్రకారం యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 7,70,833 మంది జనాభా ఉన్నారు. ఇందులో మగవారు 3,90,492 మంది ఉండగా ఆడవాళ్లు 3,80,341 మంది ఉన్నారు. ఈ లెక్కన 10,151 మంది మహిళలు తక్కువగా ఉన్నారు. కాగా 2023 అంచనాల ప్రకారం జిల్లాలో 2.10 లక్షల జనాభా పెరిగి 8,39,894కు చేరింది. పురుషులు 4,24,391 ఉన్నారు. మహిళలు 4,15,502 మంది ఉన్నారు. ఈ లెక్కన 8,889 మంది మహిళలు తక్కువగా ఉన్నారు. 

8 శాతం ఎక్కువగా మగ శిశువులు

అందరిలో వారసుడు కావాలన్న ఆకాంక్ష పెరుగుతోంది. మొదటి సంతానం మగ పిల్లాడు అయితే రెండో సంతానం ఎవరైనా ఫరవాలేదనుకొని కుటుంబ నియంత్రణ చేయించుకుంటున్నారు. అదే మొదటి సంతానం ఆడ పిల్లయితే రెండో సంతానం కచ్చితంగా మగ పిల్లాడే కావాలని ఆశ పడుతున్నారు. ఇందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. లింగ నిర్దారణ పరీక్షలు చేయిస్తూ ఆడ పిల్లలని తేలితే కొందరు మూడో ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు అబార్షన్లు సైతం చేయిస్తున్నారు.

ఇలాంటి అబార్షన్లు కేసులు ఇటీవల తరచూ బయటపడుతున్నాయి. హెల్త్​ డిపార్ట్​మెంట్ లెక్కల ప్రకారం 2022 నుంచి 2025 వరకూ 40, 730 జన్మించారు. ఇందులో ఆడ పిల్లల కంటే 8 శాతం మగ పిల్లలు ఎక్కువగా జన్మించారు. 

16 శాతం మరణాలు ఎక్కువ

మరణాల విషయానికొస్తే ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువగా చనిపోతున్నారు. అయితే మగవారి కంటే ఎక్కువగా మహిళలకు అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి. గర్భాశయ, బ్రెస్ట్​ క్యాన్సర్​సమస్యలు అదనం. వీటితో పాటు మగవారి కంటే ఆడవారిలో లావు సమస్య అధికంగా ఉంది. ఇవి కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు మగవారితో సమానంగానే ఉంటున్నాయి. సిగరెట్, లిక్కర్​కారణంగా మగవారు వివిధ రకాల అనారోగ్యానికి గురవుతున్నారు.

ఈ కారణంగా ఆరోగ్యం విషమించి చనిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లోనూ మగవాళ్లే ఎక్కువగా చనిపోతున్నారు. మరణాలపై హెల్త్​ డిపార్ట్​మెంట్​ లెక్కల ప్రకారం యాదాద్రి జిల్లాలో 2022 నుంచి 2025  వరకూ 20,078 మంది చనిపోయారు. మరణించిన వారిలో మహిళల కంటే 3,132 మంది 16 శాతం పురుషులు ఎక్కువగా ఉన్నారు. జననంలో 8 శాతమే ఎక్కువగా మగ శిశువులు పుడుతున్నారు. కానీ మరణాల్లో మాత్రం 16 శాతం ఎక్కువ నమోదు కావడం గమనార్హం.

యాదాద్రి జిల్లాలో 2022 జనవరి నుంచి 2025 వరకూ జనన, మరణ గణాంకాలు

జననాలు

సంవత్సరం    మగ పిల్లలు    ఆడ పిల్లలు    మొత్తం

2022    5681    4968    10,649

2023    5715    5029    10,74

2024    5838    5080    10,918

2025    4543    3886    8429

మొత్తం    21,767    18,963    40,730

సంభవించిన మరణాలు

సంవత్సరం    పురుషులు    మహిళలు    మొత్తం

2022    2935    2215    5150

2023    3052    2047    5099

2024    3075    2276    5351

2025    2543    1935    4478

మొత్తం    11,605    8473    20,078