రిజర్వేషన్లపై ఆఫీసర్ల కసరత్తు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు చేంజ్

రిజర్వేషన్లపై ఆఫీసర్ల కసరత్తు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు చేంజ్

యాదాద్రి, వెలుగు:  పంచాయతీ ఎన్నికల కోసం ఆఫీసర్లు రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రాతిపదికన, బీసీలకు డెడికేటేడ్​కమిషన్​ ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించనున్నారు. అయితే చట్ట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు తగ్గినా రాజకీయ పార్టీలు  42 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంది. అయితే 2018 పంచాయతీరాజ్​ చట్టం సవరణ కారణంగా గత పంచాయతీ ఎన్నికల్లో కల్పించిన రిజర్వేషన్లు రొటేషన్​ పద్దతిలో మారనున్నాయి.  ఆయా కేటగిరిల్లో రిజర్వేషన్ల ఖరారు అనంతరం లాటరీ పద్ధతిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించారు. 

రొటేషన్ పద్ధతిలో  రిజర్వేషన్లు

గతంలో మాదిరిగా కాకుండా ఈసారి రొటేషన్​ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపు ఉంటుంది. దీంతో గత ఎన్నికల్లోని రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. దీనివల్ల ఒకే వర్గానికి వరుసగా రిజర్వేషన్​ ఉండకుండా మారే అవకాశమంది. జనరల్​ ఉన్న చోట బీసీలకు, మహిళలు ఉన్న చోట జనరల్​, జనరల్​ ఉన్న చోట మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశముంది. 

రాజకీయంగా 164 పంచాయతీలు

చట్ట ప్రకారం రిజర్వేషన్లలో బీసీలకు తక్కువ పంచాయతీలు దక్కుతున్నా.. రాజకీయంగా మాత్రం 42  శాతం పంచాయతీలు దక్కుతాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్​ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకారమే ఈ ఏడాది సెప్టెంబర్​లో బీసీలకు జిల్లాలో 164 పంచాయతీలు, 1528 వార్డులను కేటాయించారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. తాజా ప్రక్రియలో బీసీలకు తక్కువ సీట్లు దక్కినా.. రాజకీయంగా కాంగ్రెస్​ 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నందున గతంలో ప్రకటించిన పార్టీపరంగా జనరల్​ సీట్లలో బీసీలకు అవకాశం కల్పిస్తూ 164 సీట్లను కేటాయించే అవకాశం ఉంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ పద్దతిలోనే రిజర్వేషన్ల కేటాయించే అవకాశాలున్నాయి.

యాదాద్రిలో 427 పంచాయతీలు

పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లపై రెండు రోజులుగా యాదాద్రి జిల్లాఫీసర్లు, మండలాఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. అడిషనల్​ కలెక్టర్​ ఏ. భాస్కరరావు నేతృత్వంలో ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్​ రెడ్డి, డీపీవో విష్ణువర్దన్​ రెడ్డి, ఇతర ఆఫీసర్లు ఫస్ట్​ప్లోర్​లోని స్టేట్​ చాంచర్​లో ప్రత్యేకంగా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో 427 గ్రామ పంచాయతీలు, 3704 వార్డులు ఉన్నాయి. మండల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయింపు ప్రక్రియ సాగుతోంది. ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్ల కేటాయింపు ఉంటుంది. ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్లు కేటాయింపు ఉంటుంది. దీంతో ఒక్కో మండలంలో ఒక్కో విధంగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయింపు ఉంటుంది. 

బీసీలకు 130..?

ఎస్సీ, ఎస్టీలకు గతంలో మాదిరిగా 2011 జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ లెక్కన ఎస్సీలకు 74 సీట్లు కేటాయించనున్నారు. ఎస్టీలకు 49 సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎస్టీ మహిళలకు 173 వార్డులు, ఎస్టీ జనరల్‌కు ​ 192 కేటాయించారు. ఎస్సీ మహిళలకు 240, ఎస్సీ జనరల్​కు 396 కేటాయించారు. మండల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయిస్తున్నందున, కొన్ని మండలాల్లో తక్కువగా మరికొన్ని 23 శాతం అంతకంటే ఎక్కువ శాతం కూడా బీసీలకు రిజర్వేషన్లు దక్కే అవకాశముంది. దీంతో జిల్లాలో బీసీలకు 130 వరకూ రిజర్వేషన్లు దక్కే అవకాశముందని తెలుస్తోంది. రిజర్వేషన్ల ఖరారు అనంతరం ఇందులో మహిళలకు 50 శాతం పంచాయతీలను లాటరీ పద్దతిలో కేటాయింపు ఉంటుంది.