
- యోగాతో విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతది
- కేంద్ర విద్యాశాఖ మంత్రిధర్మేంద్ర ప్రధాన్
వికారాబాద్, వెలుగు: దేశంలో ఎటువంటి మార్పుకైనా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యమం రావాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జినుగుర్తిలో ఏకలవ్య ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సందీపని గురుకుల కొత్త భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్కూళ్లల్లో యోగాను తప్పనిసరిగా అమలు చేయాలని, దీనివల్ల విద్యార్థుల్లో శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. హైదరాబాద్ పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల పూర్వవైభవానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు పెద్ద మొత్తంలో ఆసుపత్రులను నిర్మించేందుకు అధిక నిధులను కేటాయించామన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, విశ్రాంత ఐఏఎస్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్(జమ్మూ అండ్ కాశ్మీర్) సతీశ్ చంద్ర, ఎస్పీ నారాయణరెడ్డి, ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు భాగయ్య, చైర్మన్ పి. వెంకటేశ్వరరావు, సందీపని గురుకులం చైర్మన్ మల్లారెడ్డి, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణన్, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్రొఫెసర్లు, డాక్టర్లు పాల్గొన్నారు.