ప్రజల సొమ్ముకు మీరు ఓనర్లు కాదు

ప్రజల సొమ్ముకు మీరు ఓనర్లు కాదు
  • ఆరోగ్యశ్రీ బకాయిలు ఇయ్యరు గానీ, నన్ను ఓడించేందుకు పైసలు పంచుతుండు
  • కేసీఆర్ పాలనలో ఏదీ సక్కగ లేదుః విజయశాంతి

జమ్మికుంట/వీణవంక, వెలుగు: ‘‘ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు.. రైతుల వడ్ల మీద శ్రద్ధ లేదు.. కేవలం నేను గెలవద్దని అందరూ హుజూరాబాద్‌‌‌‌లో తిష్టవేసి కుట్రలు పన్నుతున్నరు” అని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా వీణవంక, జమ్మికుంట మండలాల్లోని వివిధ గ్రామాల్లో బీజేపీ నేతలు విజయశాంతి, బాబూమోహన్‌‌‌‌తో కలిసి ఈటల ప్రచారం చేశారు. ‘‘కేసీఆర్ రెండోసారి గెలిచాక నియంతలా తయారైండు. నిజాం లెక్క రాజరికం నడుపుతున్నడు. రాజేందర్‌‌‌‌‌‌‌‌కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు రావు అని ప్రచారం చేస్తున్నరు. కేసీఆర్ బానిసల్లారా.. అది ప్రజల సొమ్ము, దానికి మీరు ఓనర్లు కాదు’’ అని స్పష్టం చేశారు. ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ వాళ్లు తనపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజీనామా మొఖాన కొట్టిన
‘‘తెల్ల రేషన్ కార్డు చూపిస్తే ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్‌‌‌‌మెంట్ ఇస్తలేరు. ఆరోగ్యశ్రీ కింద హాస్పిటళ్లకు రూ.1,300 కోట్లు బాకీ పడ్డరు. వాటిని కట్టడానికి చేతులు వస్తలేవుగానీ.. మంత్రి హరీశ్‌‌‌‌ రావు ఇక్కడ రాజేందర్‌‌‌‌‌‌‌‌ను ఓడించేందుకు డబ్బులు పంచుతున్నడు” అని ఈటల ఫైర్ అయ్యారు. ఏప్రిల్​30న తనపై చిల్లర ఆరోపణ చేసి, మే 2న మెడలు పట్టి బయటికి గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో మంత్రి పదవి నుంచి తీసివేయడం బాధ అనిపించిందే తప్ప, పదవి పోయినందుకు కాదన్నారు. రాజీనామా చేస్తావా లేదా అని డిమాండ్ చేస్తే వారి మొఖాన కొట్టి వచ్చానని చెప్పారు. ‘‘రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ కుమ్మక్కయ్యారని  కేటీఆర్ అంటున్నరట. మే 7న  మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బిడ్డ ఎంగేజ్ మెంట్‌‌కి ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి వెళ్లిన. అక్కడ సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డి ఉన్నరు. పెళ్లిలో కలిస్తే మాట్లాడుకోవడం తప్పా? అదేదో ద్రోహం అయినట్లు ఇయ్యాళ టీఆర్ఎస్ అధికార పత్రిక అబద్ధాలు రాసింది’’ అని ఈటల మండిపడ్డారు.
కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను నిలదీయాలె: విజయశాంతి
కేసీఆర్ ​పాలనలో ఏదీ సక్కగలేదని మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. ‘‘రైతులకు రుణమాఫీ చెయ్యకుండా నాన్చుతున్నడు. పేద పిల్లలు చదువుకొనే 4 వేల స్కూల్స్ మూసేసిన్రు. గూడు లేని ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇయ్యట్లేదు’’ అని మండిపడ్డారు. ఏడేండ్లలో టీఆర్ఎస్​ ప్రభుత్వం 4 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఆ డబ్బంతా ఎక్కడ పెట్టారో, ఎవరి జేబుల్లోకి వెళ్లిందో జనం కేసీఆర్​ను నిలదీయాలని, అవినీతి సీఎంను గద్దె దించాలని పిలుపునిచ్చారు. కేసీఆరే ఈటలను  బీజేపీలో చేర్చినట్లు కాంగ్రెసోళ్లు చెప్తున్నారని, కానీ కాంగ్రెస్ ఆఫీస్ ముందే ‘మా ఎమ్మెల్యేలు అమ్మబడును’ అని బోర్డ్ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ గుండెల్లో రైళ్లు: బాబూమోహన్
హుజూరాబాద్ చిన్న ఎలక్షన్ అంటున్న సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మంత్రులను ఇక్కడ వేట కుక్కల్లా, తోడేళ్లలా ఎందుకు తిప్పుతున్నారో చెప్పాలని బాబూమోహన్ డిమాండ్ చేశారు. ఈటల గెలుపు ఖాయమని తెలిసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. హరీశ్​రావు ఈటల రాజేందర్ మీద అవాకులు చవాకులు పేలుతున్నారని, బామ్మర్ది ఎంగిలి మెతుకులకు ఆశపడే ఇక్కడ తిరుగుతున్నారని బొడిగ శోభ ఫైర్ అయ్యారు. ‘‘దుబ్బాకలో చెల్లని నువ్వు ఇక్కడ ఎలా చెల్లుతావు” అంటూ ఎద్దేవా చేశారు.