లాక్ డౌన్ నా వల్ల కావడం లేదు.. త్వరగా పెళ్లి చేయండి

లాక్ డౌన్ నా వల్ల కావడం లేదు.. త్వరగా పెళ్లి చేయండి
  • ప్రేమకు అంగీకరించారు సరే.. పెళ్లెప్పుడు చేస్తారంటూ సెల్ టవర్ ఎక్కిన ప్రేమికుడు చిరంజీవి
  • లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదాలు వేస్తుండడంతో సెల్ టవర్ ఎక్కి నిరసన

బళ్లారి: లాక్ డౌన్ వల్ల జనం ఇబ్బందుల మాటేమో గాని.. ఓ అపర ప్రేమికుడు మాత్రం తెగ ఇబ్బందిపడిపోతున్నాడు. తన ప్రేయసితో పెళ్లికి ఇరువైపులా పెద్దలు ఒప్పుకున్నారన్న సంతోషంతో ఉన్నా.. అయితే లాక్ డౌన్ అంటూ పెళ్లి వాయిదాల మీద వాయిదాలేస్తున్నారు.. ఇక నేను భరించలేను.. పెళ్లి చేస్తారా.. లేదా దూక మంటారా అంటూ సెల్ టవర్ ఎక్కాడు. దూకుతానంటూ బెదిరించి హడావుడి చేశాడు. కర్నాటకలోని బళ్లారి జిల్లా హోసపేట తాలుకా మరియమ్మనహళ్లిలో జరిగిందీ ఘటన. 
మరియమ్మనహళ్లికి చెందిన చిరంజీవి (23) తనకు పరిచయం అయిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె బాగా నచ్చడంతో ఇంట్లో పెద్దలకు చెప్పగా తొలుత వారు అభ్యంతరం తెలిపినా.. అమ్మాయి తరపు వారితో మాట్లాడి చెబుతానంటే సరేనన్నాడు. అమ్మాయి తరపు వారు సైతం ఇలాగే తొలుత అభ్యంతరం చెప్పినా.. తమ కూతురు ససేమిరా అని భీష్మించడంతో  మీ ఇష్టం అంటూ పెళ్లికి ఓకే చెప్పారు. పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. అయితే కొద్ది రోజులకే కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ వచ్చిపడింది. 
ముహూర్తం ప్రకారం తన పెళ్లి చేస్తారని భావించిన చిరంజీవి తన స్నేహితులందరికీ తన ప్రేమ గురించి గొప్పలు చెప్పుకుంటూ టౌన్ కు వెళ్లి పెళ్లి బట్టలు కూడా కొనుక్కున్నాడు. తన శ్రీమతి కాబోతున్న యువతితో రోజూ ఉత్సాహంగా ఫోన్లో తెగ కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే లాక్ డౌన్ నెలల తరబడి పొడిగిస్తూ వస్తుండడంతో చిరంజీవి తీవ్రంగా ఇబ్బందిపడిపోయాడు. పెళ్లెప్పుడు చేస్తారంటూ ఇంట్లో పెద్దల వద్ద తెగ హడావుడి చేశాడు. గట్టిగా బెదిరింపులకు దిగినా లాక్ డౌన్ పోనీ అని దాట వేస్తుండడంతో విసిగిపోయిన చిరంజీవి సోమవారం సెల్ టవర్ ఎక్కాడు. తనకు వెంటనే పెళ్లి చేయకపోతే దూకేస్తానంటూ హడావుడి చేశాడు. సరేనన్నా నమ్మకం కుదరక బెట్టు చేయడంతో పోలీసులను పిలిపించారు. మహిళా సీఐ వసంత, ఎస్.ఐ మీనాక్షి బుజ్జగించి హామీ ఇవ్వడంతో చిరంజీవి సెల్ టవర్ దిగి వచ్చేందుకు అంగీకరించాడు. సుమారు గంటకుపైగా సాగిన ఈ ఉదంతం పరిసర ప్రాంతాల్లో సంచలనం సృష్టించింది.