- యావన్ హత్య కేసులో 10 మంది అరెస్ట్
- రెక్కీ నిర్వహించి.. కత్తులతో వేటాడిన్రు
- వివరాలు వెల్లడించిన డీసీపీ రక్షిత కృష్ణమూర్తి
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ చిలకలగూడలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి బొమ్మన యావన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును పోలీసులు నాలుగు రోజుల్లో ఛేదించారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి సోమవారం వెల్లడించారు. యువతి కుటుంబ సభ్యులు, బంధువులే పక్కా ప్లాన్ ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు.
మృతుడు యావన్, యువతి చంద్రిక స్కూల్ నుంచే ఫ్రెండ్స్. రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే, వీరి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాన నిందితుడు అల్లబోయిన సాయికిరణ్ (27) యువతికి వరుసకు బావ అవుతాడు. చంద్రికను తానే వివాహం చేసుకోవాలని భావించిన సాయికిరణ్.. యావన్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఈ కిరాతకానికి ఒడిగట్టాడు.
ఐదు రోజుల ముందే రెక్కీ, స్కెచ్..
ఈ హత్య పూర్తిగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ఐదు రోజుల ముందే నిందితులంతా రహస్యంగా సమావేశమై కుట్ర పన్నారు. యావన్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఎప్పుడు వస్తున్నాడు? అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచి రెక్కీ నిర్వహించారు. ఈ నెల 7న రాత్రి పక్కా ప్లాన్ ప్రకారం యావన్ను సీతాఫల్మండిలో చుట్టుముట్టి కత్తులతో గొంతుకోసి విచక్షణారహితంగా నరికి చంపారు.
నిందితుల్లో ఒక మైనర్..
ఈ కేసులో ఏ1 అల్లబోయిన సాయికిరన్తో పాటు రాజం నరసింహ యాదవ్ (50), రాజం శ్రీశైలం యాదవ్ (48), రాజం మల్లేశ్ యాదవ్ (48), రాజం పరమేశ్ యాదవ్ (19), రాజం వంశీకృష్ణ (19), రాజం మనీశ్ (21), శ్రీగిరి రాహుల్ (22), కుచ్చుల శివనందన్ యాదవ్ (20), ఒక మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో యువతి తండ్రి, తమ్ముడు, ఇద్దరు బాబాయిలు ఉన్నారు.
నిందితుల్లో ఆరుగురికి గంజాయి పరీక్షలు నిర్వహించగా, శ్రీగిరి రాహుల్, కుచ్చుల శివనందన్ యాదవ్కు పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ వెల్లడించారు. ప్రధాన నిందితుడు సాయికిరణ్ పాత నేరస్తుడని, అతనిపై ఇప్పటికే రౌడీషీట్ ఉందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
