
అందరికీ విద్య అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఏడాదిలోనూ కొత్త గురుకులాలను ఏర్పాటుచేసింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 8 బీసీ గురుకులాలు ఏర్పాటయ్యాయి. వీటిని సోమవారం(17న) అధికారికంగా ప్రారంభించారు. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు విద్యాఅవకాశాలు కల్పించే లక్ష్యంతో కొత్త గురుకులాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున కొత్త బీసీ గురుకులాలు ఏర్పాటు అయ్యాయి. నాణ్యమైన విద్యతోపాటు, భోజనం, వసతి సౌకర్యాలను సమకూరుస్తూ గురుకులాల్లో అందుకు అవసరమైన మౌలికసదుపాయాలను కల్పించారు. దశలవారీగా బీసీ గురుకులాలను విస్తరిస్తూ ప్రతి పేద విద్యార్థికి విద్యఅవకాశాలు కల్పించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో కేవలం రెండు బీసీ గురుకులాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పడు కొత్తగా వచ్చిన 8 గురుకులాలతో జిల్లాలో బీసీ గురుకులాల సంఖ్య పదికి చేరింది.
కొత్తగా 1,920 మంది అడ్మిషన్లు
జిల్లాలో ఏర్పాటు చేసిన 8 బీసీ గురుకులాల్లో ఈ ఏడాది నుంచి 1,920 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. ప్రతి గురుకులంలో 240 మంది చొపుపన ఉంటారు. బాలబాలికలకు వేర్వేరుగా గురుకులాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 8 కొత్త గురుకులాల్లో బాలికలకు-4, బాలురకు-4 చొప్పున ఏర్పాటు చేశారు. నిర్వహణకు అవసరమైన సిబ్బందిని, ఉద్యోగులను కూడా నియామించారు.
5 నుంచి 7వ తరగతి వరకే…
బీసీ గురుకులాల్లో ఈ ఏడాదిలో 5 వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే విద్యాబోధన అందిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. క్రమంగా వీటిని 12వ తరగతి(ఇంటర్) వరకు అప్‌గ్రేడ్ చేసుకుంటామని బీసీ గురుకులం అధికారి ఒకరు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరంలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఉన్న రెండు బీసీ గురుకులాల్లో టెన్త్ వరకు విద్యాబోధన ఉంది.
కొత్త గురుకులాలు ఇవే…
కొత్తగా ఏర్పాటైన 8 గురుకులాలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాలికల గురుకులాలు షాద్‌నగర్‌లోని నూర్ ఇంజనీరింగ్ కాలేజి, ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని సుప్రబాత్ ఇంజనీర్ కాలేజి, శంషాబాద్ మండలం పాలమాకులలోని విజయ కృష్ణ ఇంజనీరింగ్ కాలేజి, చేవెళ్ల మండలం ఉరిల్లాలో సాగర్ గ్రూప్ ఇనిస్టిట్యూట్, బాలుర గురుకులాలు మంచాల మండలం నోముల గ్రామంలో బీకేబీజీ ఇంజనీరింగ్ కాలేజి, మహేశ్వరం మండలం రాచులూర్‌లో నిశిత ఇంజనీరింగ్ కాలేజి, , హయత్‌నగర్ మండలం మునగనూర్‌లోని నారాయణ జూనియర్ కాలేజి, మహేశ్వరంలోని జేజే ఇంజనీరింగ్ కాలేజిల్లో ఏర్పాటు చేశారు.