
హైదరాబాద్, వెలుగు: బంగారం ధర పరుగు ఆగడం లేదు. రోజురోజుకు గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంది. గురు, శుక్రవారాల్లో ధర కాస్త దిగిరావడంతో.. ఇక ఇదే ఒరవడి ఉంటుందని కొనుగోలుదారులు ఆశించారు. కానీ శనివారం మళ్లీ ఒక్కసారిగా ధర పెరిగింది. హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి రూ.1,18,530 ఉండగా, అది శనివారం నాటికి రూ.1,19,400కు చేరింది.
అంటే ఒక్క రోజులోనే రూ.870 పెరిగింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,08,650 ఉండగా, అది రూ.1,09,450కి పెరిగింది. అలాగే శుక్రవారం కిలో వెండి ధర రూ.1,62,000 ఉండగా, శనివారం నాటికి రూ.1,65,000కు చేరింది. కాగా, గత ఏడాది వ్యవధిలోనే బంగారం ధర డబుల్ అయింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. కొన్ని నెలల్లోనే తులం రూ.2 లక్షలకు చేరువయ్యే చాన్స్ ఉందని చెబుతున్నారు. రేట్లు ఇప్పట్లో దిగొచ్చే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొంటున్నారు. అమెరికా వడ్డీ రేట్లు, టారిఫ్‌లకు తోడు వివిధ దేశాల మధ్య ఘర్షణలు బంగారం ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు.
పెట్టుబడులతో పెరిగిన డిమాండ్..
బంగారం సురక్షితమైన ఆస్తిగా పరిగణిస్తుండడంతో దానిపై ఇన్వెస్ట్మెంట్చేసేవారు పెరుగుతున్నారు. స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్‌పై ఆశించిన స్థాయిలో రాబడులు రాకపోవడంతో చాలామంది బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. బంగారం బిస్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. తిరిగి ధరలు పెరిగినప్పుడు వాటిని విక్రయించుకోవచ్చని భావిస్తున్నారు. ధరల పెరుగుదలకు ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ నెలలో దీపావళితో పాటు దంతేరాస్ ఉండడంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.
ఆభరణాల కొనుగోలుపై ప్రభావం
పెళ్లిళ్లతో పాటు ఇతర ఏ శుభకార్యం చేయాలన్నా.. బంగారం కొనడం మన దగ్గర సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. ఇది కాస్తా స్టేటస్ సింబల్ గా మారింది. అయితే పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం కష్టంగా మారింది. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే బంగారం కొనుగోలు చేసే పరిస్థితి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. 10 గ్రాముల ఆభరణాలు కొనుగోలు చేయాలన్నా జీఎస్టీ, తరుగు, ఎస్ఎస్టీ అంటూ అదనంగా వసూలు చేస్తుండడంతో సుమారు రూ.1.50 లక్షల దాకా పెట్టాల్సి వస్తోంది. కాగా, పెరిగిన బంగారం రేట్లు అమ్మకాలపై ఎఫెక్ట్ చూపుతున్నాయని జ్యువెలరీ యజమానులు చెప్తున్నారు. పెరిగిన రేట్ల వల్ల జనం కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్నారని అంటున్నారు. మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తూ కొనుగోలు చేయాలని, పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నారు.
గత వారం రోజులుగా బంగారం ధరలు ఇలా..
(ఒక్క గ్రాముకు రూ.ల్లో)
వారం 24 క్యారెట్లు 22 క్యారెట్లు
శనివారం 11,940 10,945
శుక్రవారం 11,853 10,865
గురువారం 11,869 10,880
బుధవారం 11,924 10,930
మంగళవారం 11,744 10,765
సోమవారం 11,689 10,715
ఆదివారం 11,548 10,585