అమెరికాలో 10 లక్షల రాగి నాణేలు లభ్యం

అమెరికాలో 10 లక్షల రాగి నాణేలు లభ్యం

వాషింగ్టన్: అమెరికాలోని ఓ ఇంట్లో 10 లక్షల పాత రాగి పెన్నీలు(యునైటెడ్ స్టేట్స్ నాణెలు) లభ్యమయ్యాయి. జాన్ రేయెస్, ఎలిజబెత్ భార్యభర్తలు. జాన్ రేయెస్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. దంపతులు ఇటీవల ఇల్లు మారుదామని నిర్ణయించుకున్నారు. లాస్ ఏంజిల్స్‌‌లోని పికో -యూనియన్ పరిసరాల్లో ఉన్న ఎలిజబెత్ తండ్రి పాత ఇల్లు ఖాళీగా ఉండటంతో అక్కడికి వెళ్లారు. చాలాకాలంగా ఎవరూ లేకపోవడంతో ఇల్లు అంతా బూజు పట్టి, చెత్తాచెదారంతో నిండిపోయింది. 

దాంతో జాన్ రేయెస్ దంపతులు ఇంటిని శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి సెల్లార్ లోకి వెళ్లారు. అక్కడ వారికి చాలా పెట్టెలు కనిపించాయి. వాటిని తెరిచి చూసిన జాన్ రేయెస్ దంపతులకు యునైటెడ్ స్టేట్స్ పాత రాగి నాణెలు కనిపించాయి. ఆ డబ్బాలన్నింటిని దంపతులు బయటకు తీశారు. వాటిలోని కాయిన్స్ లెక్కించగా 10 లక్షలకు పైగా ఉన్నాయి. 

పెట్టెలను బయటకు తీయడానికి తమకు ఒక రోజంతా పట్టిందని జాన్ రేయెస్ తెలిపారు. ఆ ఇంటిని తన భార్య తండ్రి 1900లో నిర్మించాడని వెల్లడించారు. ఆయన తన సోదరుడు, ఇద్దరూ జర్మన్ వలసదారులతో చాలా ఏండ్లు ఆ ఇంట్లోనే నివసించారని తెలిపారు. వాళ్లే ఈ నాణేలను ఇక్కడ పెట్టి ఉండవచ్చని అన్నారు. ఇవి యూఎస్ కరెన్సీలో అతితక్కువ విలువ గల ఫిజికల్ యూనిట్‌‌ అని తెలిపారు. ప్రస్తుతం ఈ నాణెలు చెలామణిలో లేవని చెప్పిన జాన్ రేయెస్..ఈ పెన్నీలను ఏమి చేయాలో ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు.