బడ్జెట్​లో ఇన్​ఫ్రాకు 10 లక్షల కోట్లు కేటాయింపు

బడ్జెట్​లో ఇన్​ఫ్రాకు 10 లక్షల కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెరుగైన సౌలతులు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ముందుకువెళ్తోంది. బడ్జెట్ లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈసారి బడ్జెట్ తయారు చేయగా, అందులో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కూడా ఉంది. ఈ రంగానికి ఈసారి ఏకంగా రూ.10 లక్షల కోట్లు కేటాయించింది. ముఖ్యంగా రోడ్, ఎయిర్ కనెక్టివిటీ, జల రవాణా, లాజిస్టిక్స్, షిప్పింగ్, అర్బన్ ఏరియాల్లో సౌలతుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది. ‘‘వరుసగా మూడో ఏడాది ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ 33 శాతం పెంచాం. ఈసారి 10 లక్షల కోట్లు కేటాయించాం. ఇది 2019–20తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఇక మన జీడీపీలో 3.3 శాతం” అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అమృత్ కాలానికి అనుగుణంగా అవసరమైన సౌలతులు కల్పించేందుకు చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ఎక్స్ పర్ట్స్ కమిటీ రివ్యూ చేస్తుందని, ఫ్రేమ్ వర్క్ తయారు చేస్తుందని తెలిపారు. కొత్తగా తయారు చేయనున్న ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ ప్లాన్ మరిన్ని ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ డెవలప్ అయితే యువతకు ఉద్యోగాలు దొరకడంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. 

రోడ్లకు 2.70 లక్షల కోట్లు    

హైవేల నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. రోడ్ ట్రాన్స్ పోర్టు అండ్ హైవేస్ మినిస్ట్రీకి రూ.2.70 లక్షల కోట్లు కేటాయించింది. పోయినేడాది రూ.1.99 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి 36 శాతం నిధులు పెంచింది. 2022-–23 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 25 వేల కిలోమీటర్ల మేర కొత్త హైవేలు నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు 11 వేల కిలోమీటర్లు పూర్తి చేసింది. ఇప్పుడు కేటాయించిన నిధులతో మిగిలిన 14 వేల కిలోమీటర్లు పనులు పూర్తి చేయనుంది. 

100 ప్రాజెక్టులు.. లక్ష కోట్లు  

పోర్టులు, కోల్, స్టీల్, ఫర్టిలైజర్స్, ఫుడ్ గ్రెయిన్స్ సెక్టార్లకు మెరుగైన ట్రాన్స్ పోర్టు సౌలతులు కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. 100 క్రిటికల్ ట్రాన్స్ పోర్టు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను గుర్తించామని తెలిపింది. ఇందుకోసం రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని, ప్రైవేట్ సెక్టార్ నుంచి మరో రూ.15 వేల కోట్లు సేకరిస్తామని పేర్కొంది. 

చెత్త రీసైక్లింగ్ ప్లాంట్లు 500 

గోబర్ దాన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా కొత్తగా 500 చెత్త రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా 200 బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, వీటిలో 75 అర్బన్ ఏరియాల్లో నెలకొల్పుతామని తెలిపింది. మరో 300 కమ్యూనిటీ/క్లస్టర్ బేస్డ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఇందుకోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొంది.

సిటీలకు ఏటా 10 వేల కోట్లు  

అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీని కింద ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపింది. ఈ ఫండ్ ద్వారా టయర్ 2, 3 సిటీల్లో ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపడతామంది.