
- రైల్వేస్టేషన్ విధ్వంసంలో మరో 10 మంది అరెస్ట్-
- వీడియోల ఆధారంగా నిర్ధారణ
- రైల్‌కోచ్, అద్దాలు ధ్వంసం చేసిన పృథ్వీరాజ్
- ఆవుల సుబ్బారావు, మేనేజర్ శివను విచారిస్తున్న పోలీసులు
- జనగామ జిల్లాలో ఆర్మీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఆదివారం వరకు 46 మంది ఆర్మీ అభ్యర్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. బుధవారం మరో10 మందిని అరెస్ట్ చేశారు. బోయిగూడలోని రైల్వేకోర్టు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన మలవెల్లి మధుసూదన్(20), ఆదిలాబాద్ జిల్లా సోనపూర్‌కు చెందిన రాథోడ్ పృథ్వీరాజ్(23) రైల్వేస్టేషన్ విధ్వంసంలో ప్రధాన నిందితులుగా కోర్టుకు తెలిపారు.
రిమాండ్ రిపోర్ట్‌లో కీలక వివరాలు
రాథోడ్ పృథ్వీరాజ్ రైలు బోగీల అద్దాలు ధ్వంసం చేసి సీట్లకు నిప్పు పెట్టాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో వైరలైన వీడియో ఫుటేజ్‌ఆధారంగా విధ్వంసానికి రెచ్చగొట్టింది పృథ్వీరాజ్‌గా నిర్ధారించారు. హకీంపేట్ సోల్జర్స్ వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేసిన వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.
ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం సాయి డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు ఆందోళనలో కీలకంగా వ్యవహరించినట్లు ప్రస్తావించారు. హకీంపేట్ సోల్జర్స్ గ్రూప్ అడ్మిన్ బింగి రమేష్(ఏ3), పెట్రోల్‌తో రైల్వేస్టేషన్‌ను తగులపెడదామని రెచ్చగొట్టిన మల్కాజిగిరి లాలాపేటకు చెందిన రాజా సురేందర్ కుమార్(ఏ4)ను నిందితులుగా తెలిపారు.
ఆవుల సుబ్బారావు,శివ సపోర్టుతో..
సాయిఅకాడమీ చైర్మన్ ఆవుల సుబ్బారావు, మేనేజర్ శివల విచారణ కొనసాగుతోంది. కాగా ఈ ఇద్దరు ఆందోళనలకు సపోర్ట్ చేశారని పోలీసులు రిమాండ్రిపోర్టులో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించారు.‘‘రైల్వేస్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ, హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్, చలో సికింద్రాబాద్ ఏఆర్‌వో 3, ఆర్మీ జీడీ 2021 మార్చ్ ర్యాలీ, సీఈఈ సోల్జర్స్’’ గ్రూపుల్లో రైల్వేస్టేషన్ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. గ్రూప్ అడ్మిన్లు, వాట్సాప్ ఆడియోలు, మెసేజ్‌లు, విధ్వంసం వీడియోలు,చాటింగ్స్‌తో కూడిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రొడ్యూస్చేశారు.
ఎవరో రెచ్చగొట్టిన్రు
వీడియోలో ఉంది నా కొడుకు పృథ్వీ. ఆర్మీలకు పోతానన్నడు. ట్రైనింగ్ తీసుకుంటున్నడు. వాళ్ల సార్ రమ్మన్నడని గురువారం హైదరాబాద్ వచ్చిండు. డబ్బులు లేకపోతే రూ.500 ఇచ్చినం. ఇట్ల అయితదని అనుకోలేదు. పోలీసులు ఫోన్ చేసిన తరువాత తెలిసింది. పిల్లలను ఎవరో రెచ్చగొట్టిండ్రు. కష్టపడితేనే బతికెటోళ్లం, మాకు అన్నీ కష్టాలే వచ్చినయి. కోర్టు ఖర్చులకు కూడా పైసలు లేవు.
- శ్యామ్ రావ్,
నిందితుడు పృథీరాజ్ తండ్రి