
హైదరాబాద్, వెలుగు : ఆరు గ్యారంటీల కోసం బడ్జెట్లో కనీసం10% నిధులు కూడా కేటాయించలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బుధవారం కౌన్సిల్‌లో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. బడ్జెట్ లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే ఉన్నాయని విమర్శించారు. ‘‘సీఎం ప్రజావాణిని వినడం లేదు.. ఢిల్లీవాణినే వింటున్నారు. ప్రజావాణికి ఒక్క రోజే హాజరైన సీఎం వారానికి 2 సార్లు ఢిల్లీకి వెళ్తున్నారు. అన్ని పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు’’ అని ప్రశ్నించారు.
రెండు నెలల్లో గురుకుల హాస్టళ్లలో ముగ్గురు ఆడబిడ్డలు ఆత్మహత్య చేసుకుంటే సీఎం స్పందించలేదన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే లక్ష 36 వేల కోట్లు కావాలని, కానీ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేవలం రూ. 53 వేల కోట్లు ప్రతిపాదించిందని చెప్పారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తారా లేదా నిలిపివేస్తారా అని ప్రభుత్వాన్ని అడిగారు.
మంత్రులు వర్సెస్ కవిత
కాళేశ్వరం, మిషన్ భగీరథ లో ఇంజనీర్లు తప్పు చేశారని.. వారిని ఉరి తీయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనడం అన్యాయమని అన్నారు. మాటి మాటికి బీఆర్‌ఎస్ రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసిందంటున్న కాంగ్రెస్.. చేసిన అప్పులు రాష్ట్ర అభివృద్ధికే కేటాయించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి జోక్యంచేసుకుంటూ అప్పులు తెచ్చి గొప్పలు మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
గత సర్కారు ప్రచార ఆర్బాటం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేశారని, రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు తెలంగాణ బస్సును పంపించారని కవిత చేసిన ఆరోపణలపై మంత్రి సీతక్క స్పందించారు. ఒక్క రూపాయి ప్రభుత్వం ఖర్చు చేయలేదని, రాహుల్ వాడిన బస్సు కూడా పార్టీదేనని స్పష్టం చేశారు.