బీజింగ్: విడాకులు తీసుకున్న తర్వాత తన పోషణ కోసం మాజీ భర్త నుంచి భరణం కోరడం సాధారణమే.. అయితే, ఇందుకు భిన్నంగా చైనాలో తనకు బ్రేకప్ చెప్పి వెళ్లిపోయిన ప్రియురాలిని ఓ వ్యక్తి కోర్టుకీడ్చాడు. ఆమె ఎక్కువగా తినేదని, తాము కలిసి ఉన్నప్పుడు ఆమె తిండికి, ఇతరత్రా అవసరాల కోసం 30 వేల యువాన్లు ఖర్చుచేశానని చెప్పాడు. ఒకే గ్రామానికి చెందిన ఈ యువతీయువకులకు ఓ మాట్రిమొని సైట్లో పరిచయం జరిగింది. ఆ తర్వాత ఇరువురూ కొంతకాలం డేటింగ్ చేశారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు.
సంప్రదాయంలో భాగంగా వధువుకు ‘బ్రైడ్ ప్రైస్’ కింద 20 వేల యువాన్లు ఇచ్చారు. ఇరువురూ కలిసి ఉన్న సమయంలో ప్రియుడి కుటుంబానికి చెందిన హోటల్లో ఆరు నెలల పాటు ప్రియురాలు పనిచేసింది. అయితే, ప్రియురాలు పనికన్నా తిండిపైనే ఎక్కువ దృష్టి పెట్టేదని ప్రియుడు ఆరోపించాడు. దీంతో ఆమె తీరు నచ్చక పెళ్లి రద్దు చేసుకుని విడిపోయామని వివరించాడు. ఆమె కోసం తాను ఖర్చు చేసిన డబ్బులు ఇప్పించాలని వాదించాడు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి.. ప్రియురాలి కోసం పెట్టిన ఖర్చు పట్ల సెంటిమెంటల్‌గా విలువ ఉంటుందని, ఆ సొమ్మును తిరిగివ్వమనడం సరికాదని పేర్కొంటూ కేసు కొట్టివేశారు. అయితే, బ్రైడ్ ప్రైస్ గా ప్రియుడి కుటుంబం ఇచ్చిన 20 వేల యువాన్లలో సగం సొమ్ము తిరిగివ్వాలని ప్రియురాలిని కోర్టు ఆదేశించారు.
