కదలని ‘108’ అంబులెన్స్​లు

కదలని ‘108’ అంబులెన్స్​లు

ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఐదు నిమిషాల్లో వచ్చి  గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చేర్చే 108 అంబులెన్స్ లు నేడు పరిమితమయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 108 అంబులెన్స్ లు 15 రోజుల నుంచి బయటకు కదలడం లేదు. ఆసుపత్రిలో  మొత్తం మూడు 108 అంబులెన్స్​లున్నాయి. వాటిలో ఒకదానికి డ్రైవర్ సరిగా లేకపోగా, మరొక వాహనానికి టైర్ లేదు. ఇంకో వాహనానికి డీజిల్ లేక నిరుపయోగంగా ఉంది. నియోజక వర్గ పరిధిలో ఆరు మండలాల్లో అత్యవసర పరిస్థితుల్లో108 అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ లు లేక ప్రైవేట్ వాహనాల్లో ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని 108 వాహనాలను తిరిగి ప్రారంభించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా 108 ప్రోగ్రామ్ మేనేజర్ నరేందర్ ను వివరణ కోరగా రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ విడుదల అవ్వలేదని, అంబులెన్సులకు సరిపడా సిబ్బంది లేక ఆగిపోయాయని త్వరలో 108 బడ్జెట్ రిలీజ్ కాగానే ప్రారంభిస్తామని తెలిపారు.