8 రోజుల్లో 108 మంది మృతి.. నాందేడ్ ఆస్పత్రిలో ఆగని మరణాలు

8 రోజుల్లో  108 మంది మృతి.. నాందేడ్ ఆస్పత్రిలో ఆగని మరణాలు

ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోతున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అక్టోబర్ ప్రారంభంలో 48 గంటల వ్యవధిలోనే 31మంది రోగులు చనిపోగా.. 8 రోజుల్లో మరో 108 మంది మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో ఆస్పత్రిలో 11 మంది రోగులు మరణించగా..అందులో ఓ పసిపాప కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రిలో  మరణాలు పెరుగుతుండటంపై సెంట్రల్ నాందేడ్‌‌లోని డాక్టర్ శంకర్‌‌రావ్ చవాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రి డీన్ శ్యామ్ వాకోడె స్పందిస్తూ.. ఆస్పత్రిలో  మెడిసిన్స్ కొరత లేదని మరోసారి స్పష్టం చేశారు. 

‘గడిచిన 24 గంటల్లో 1,100 మందికి పైగా రోగులను డాక్టర్లు చెకప్ చేసి, ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరో 191 మంది కొత్త రోగులను కూడా అడ్మిట్ చేసుకున్నం. ఇప్పటిదాకా 13గా ఉన్న సగటు మరణాల రేటు ప్రస్తుతం11కి పడిపోయింది. పుట్టుకతో వచ్చే రుగ్మతల వల్లే పిల్లలు చనిపోతున్నారు. ఆస్పత్రిలో పేషెంట్లకు సరిపడ మెడిసిన్స్ ఉన్నాయి. సాధారణంగా  3 నెలలకు సరిపడ స్టాక్‌‌ నిల్వ ఉంచుతం. మందుల కొరత కారణంగా ఏ రోగి చనిపోలేదు. హెల్త్ కండీషన్ సీరియస్ కావడం వల్లే మరణించారు’ అని అన్నారు.