
విచారణకు పిల్చుకొస్తే.. అద్దాలు ధ్వంసం
ఒంగోలులో మాజీ రౌడీషీటర్ వీరంగం
ప్రకాశం జిల్లా: ఒంగోలులో మాజీ రౌడీషీటర్ సురేష్ వీరంగం సృష్టించాడు. 108కి తరచూ రాంగ్ కాల్స్ చేస్తుండటంతో సిబ్బంది విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించి సురేష్‌ను విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌ను తీసుకొచ్చారు. ఇవాళ తెల్లవారుజామున సురేష్ వింతగా ప్రవర్తిస్తూ..పోలీస్‌స్టేషన్ కార్యాలయం అద్దాలు ధ్వంసం చేశాడు. ఈఘటనలో అతని చేతికి గాయాలవడంతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్ రప్పించారు. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో పోలీసులు.. సిబ్బందితో వాగ్వాదానికి దిగిన రౌడీ షీటర్ .. తన వద్ద ఉన్న అగ్గిపెట్టె తీసి 108 వాహనానికి నిప్పుపెట్టాడు. దీంతో భయపడిపోయిన సిబ్బంది కిందకు దిగి మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా.. రౌడీ షీటర్ మాత్రం మండుతున్న 108లోనే ఉండిపోయాడు. పోలీసులు.. సిబ్బంది బతిమాలినా దిగి రాలేదు. చూస్తున్నంతలోనే 108 వాహనం అంతా అంటుకుంది. వీరంగం సృష్టించిన నిందితుడు సురేష్‌ను పోలీసులు అతికష్టం మీద అంబులెన్స్‌లో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చేలోగానే 108 వాహనం పూర్తిగా దగ్ధమైంది. మాజీ రౌడీషీటర్‌ను ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.