ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు.. ఇంట‌ర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల‌కూ గుడ్ న్యూస్

V6 Velugu Posted on Jun 20, 2020

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసి విద్యార్థులంద‌రినీ పాస్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి త‌ప్ప‌నిస‌రిగా ప‌రీక్షలు పెట్టాల‌ని అనుకున్నామ‌ని, అయితే విద్యార్థుల ఆరోగ్య భ‌ద్ర‌త దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న చెప్పారు. విద్యా శాఖ ఉన్న‌తాధికారులు, జిల్లా స్థాయి అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో చ‌ర్చించి, ఆ వివ‌రాల‌ను సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి నివేదించి.. తుది నిర్ణ‌యానికి వ‌చ్చామ‌ని అన్నారు. టెన్త్ విద్యార్థుల‌కు తప్పనిసరిగా పరీక్షలు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావించింద‌ని, అందుకే పరీక్ష విధానంలో మార్పులు చేశామని, 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లుగా మార్చి షెడ్యూల్ ప్ర‌క‌టించామ‌ని చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు రాసేందుకు ఎగ్జామ్ సెంట‌ర్లు పెంచామ‌ని, అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామ‌ని చెప్పారు మంత్రి సురేశ్. అయితే క‌రోనా వైర‌స్ వ్యాప్తి దృష్యా అన్ని వ‌ర్గాల‌తో చ‌ర్చించి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామ‌ని, కరోనా ప్రబలుతున్న సమయంలో ఏ తల్లి తన బిడ్డ ఆరోగ్యం గురించి బెంగపెట్టుకోకూడదని సీఎం జగన్ చెప్పారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ ప‌రీక్ష‌లు రాసేందుకు ఫీజు క‌ట్టిన 6,30,804 మంది విద్యార్థుల‌ను ప‌రీక్షలు లేకుండా పాస్ చేయాల‌ని ఆయ‌న ఆదేశించార‌న్నారు. అయితే వారికి గ్రేడింగ్ ఎలా ఇవ్వాల‌న్న దానిపై మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించాల‌ని విద్యా శాఖ అధికారుల‌కు సూచించామ‌ని మంత్రి ఆదిమూల‌పు సురేశ్ చెప్పారు. అలాగే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల్లో ఫెయిల్ అయిన ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఇంట‌ర్ విద్యార్థుల‌ను కూడా స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు లేకుండా పాస్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

Tagged AP, Inter Students, all pass, Adimulapu Suresh, 10th exams, 10th exams cancel, No supplementary

Latest Videos

Subscribe Now

More News