ఐదుగురికి కన్​ఫర్మ్​​.. ఆరుగురికి పెండింగ్

ఐదుగురికి కన్​ఫర్మ్​​..  ఆరుగురికి పెండింగ్
  • మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్​కు చాన్స్​
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల పంచాది

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలుండగా ఆదివారం కాంగ్రెస్ హైకమాండ్​ ఐదు స్థానాల్లో అభ్యర్థులను ఖారారు చేసింది. మరో ఆరు స్థానాలని పెండింగ్​లో పెట్టింది. మెదక్, గజ్వేల్, సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్ అభ్యర్థులు ఖరారయ్యారు.  రెండు చోట్ల కొత్త అభ్యర్థులకు టికెట్లు దక్కాయి. ఇక నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్, పటాన్ చెరు, నారాయణఖేడ్ స్థానాల అభ్యర్థిత్వాలు పెండింగ్​లో పెట్టింది. ఆయా చోట్ల హస్తం టికెట్ ఎవరికి లభిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.

రోహిత్​కు మెదక్ టికెట్..

జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్​ హై కమాండ్​ మెదక్ టికెట్​ను ఇటీవల పార్టీలో చేరిన మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకు మైనంపల్లి రోహిత్​కు కేటాయించింది. ఇక్కడ కాంగ్రెస్​ టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకోగా వారెవరినీ కాదని రోహిత్​కు ఇవ్వడం గమనార్హం. ఇక నర్సాపూర్​ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్​ టికెట్​ ఎవరికీ కేటాయించలేదు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్​ కుమార్​, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకుడు సోమన్నగారి రవీందర్​ రెడ్డి కాంగ్రెస్​ టికెట్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా గాలి అనిల్​ కుమార్, ఆవుల రాజిరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్​ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్​ఎస్​ టికెట్​ వచ్చే అవకాశాలు లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న సిట్టింగ్​ ఎమ్మెల్యే చిలుముల మదన్​రెడ్డి తో కాంగ్రెస్​ ముఖ్య నాయకులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్​లో చేరితే టికెట్ కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు.

మూడు సీట్లపై సస్పెన్స్

సిద్దిపేట జిల్లాలోని మూడు సీట్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి కి టికెట్ ఖరారు చేయడంతో మిగిలిన నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గల్లో కాంగ్రెస్​ టికెట్ల కోసం  పోటీ తీవ్రంగా ఉంది. సిద్దిపేట నుంచి ధర్పల్లి చంద్రం, తాడూరు శ్రీనివాస్ గౌడ్, పూజల హరికృష్ణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా ఇక్కడి నుంచి బీసీ అభ్యర్థికి అవకాశం దొరికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి, కత్తి కార్తిక టికెట్ కోసం పోటీపడుతుండగా.. మహిళల కోటా కింద కత్తి కార్తీకకు టికెట్​ లభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్  కుమార్ రెడ్డి కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు.

 హుస్నాబాద్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లు టికెట్ కోసం పోటీపడుతుండగా, సీపీఐ పొత్తుల చర్చల కారణంగా ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్నదానిపై స్పష్టత లేదు. ఒకవేళ సీపీఐతో పొత్తు కుదిరితే హుస్నాబాద్ సీటు వారికి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని మూడు స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ ఎవరికి లభిస్తుంది అన్న విషయమై నామినేషన్ల దాఖలు వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.రెండు చోట్ల కాంగ్రెస్​కు తలనొప్పి  -సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు,  నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్లలో టికెట్ల కేటాయింపులు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. 

పార్టీ హైకమాండ్​ ప్రకటించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ల మొదటి జాబితాలో సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, జహీరాబాద్ నుంచి చంద్రశేఖర్ రావు, ఆందోల్ నుంచి దామోదర రాజనర్సింహ పేర్లు ఖరారయ్యాయి. మిగిలిన పటాన్ చెరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని హైకమాండ్​ ఫైనల్ చేయలేక పోతోంది. ఇక్కడ ముదిరాజ్ కులస్తుల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని అధికార పార్టీకి అల్టిమేటం ఇచ్చిన ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధుపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన కూడా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉండడంతో పటాన్ చెరు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన మరో రెండు మూడు రోజులు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇక నారాయణఖేడ్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం సురేశ్​ షెట్కార్, పట్లోళ్ల సంజీవరెడ్డి పోటీ పడుతున్నారు. టికెట్​ తమకే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు నేతలు ఖేడ్ లో బలంగా ఉండడం.. ఏ ఒక్కరికి టికెట్ ఇయ్యకపోయినా పార్టీ ఫిరాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ హై కమాండ్ వారి మధ్య సయోధ్య కుదిరిచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పటాన్ చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.