
కోల్‌బెల్ట్ : బొగ్గు గని కార్మికుల 11వ వేజ్‌బోర్డు ఎనిమిదో మీటింగ్ లో మినిమం గ్యారంటీ బెనిఫిట్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. మంగళవారం కోల్‌కతాలో కోలిండియా యాజమాన్యం, నాలుగు జాతీయ కార్మిక సంఘాల మధ్య జరిగిన జేబీసీసీ చర్చల్లో కనీస వేతనం 19 శాతం పెంపుదలకు కోలిండియా యాజమాన్యం అంగీకరించిందని బీఎంఎస్ నేషనల్ లీడర్, జేబీసీసీఐ మెంబర్ కొత్తకాపు లక్ష్మారెడ్డి, ఏఐటీయూసీ జనరల్సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య, సీఐటీయూ జనరల్సెక్రటరీ మందా నర్సింహారావు చెప్పారు. తొలుత బేసిక్‌పై ఎంజీబీ 26 శాతం పెరుగుదలకు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
మొదట 12 శాతం పెరుగుదలకు ఒప్పుకొని తర్వాత క్రమేణా పెంచుతూ 14, 16 శాతం నుంచి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో 19 శాతం పెంపుదలకు యాజమాన్యం అంగీకరించింది. 10వ వేజ్‌బోర్డులో ఎంజీబీ 20 శాతంతో మొదటి కేటగిరీ ఎంప్లాయ్కు రూ. 4,800 వేతనం పెరిగింది. 11వ వేజ్‌బోర్డులో 19 శాతం ఇవ్వటానికి యాజమాన్యం అంగీకరించడంతో మొదటి కేటగిరీ ఎంప్లాయ్కనీస వేతనంలో రూ.7 వేల వరకు పెరుగుదల ఉండనుంది. ప్రస్తుతం మొదటి కేటగిరీ ఎంప్లాయ్పదో వేజ్‌బోర్డులో రూ.36,703 వేతనం తీసుకుంటున్నాడు. ఎంజీబీ 19 శాతం పెరుగుదల కార్మికుల విజయమని, మిగిలిన డిమాండ్లపై తదపరి చర్చల్లో మాట్లాడతామని జాతీయ సంఘాల లీడర్లు పేర్కొన్నారు. మరోవైపు 19 శాతం పెంపుదలకు ఒప్పుకునేది లేదని హెచ్ఎంఎస్నేత రియాజ్‌అహ్మద్ చెప్పారు.