చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్..12 మంది మావోయిస్టులు మృతి

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్..12 మంది మావోయిస్టులు మృతి
  • ఇద్దరు జవాన్లకు గాయాలు కొనసాగుతున్న కూంబింగ్​
  • బీజాపూర్, దంతెవాడ, సుక్మా ఎస్పీల పర్యవేక్షణలో జాయింట్​ ఆపరేషన్
  • దండకారణ్యంలో టెన్షన్ టెన్షన్

భద్రాచలం, వెలుగు : చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకరపోరు నడుస్తోంది. బీజాపూర్​ జిల్లా గంగులూరు పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పిడియా గ్రామ అడవుల్లో సమావేశమైన మావోయిస్టులను బీజాపూర్​, దంతెవాడ, సుక్మా జిల్లాల నుంచి వెళ్లిన ఎస్టీఎఫ్​, సీఆర్పీఎఫ్​, డీఆర్​జీ బలగాలు శుక్రవారం ఉదయం చుట్టుముట్టాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విడతల వారీగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12  మంది మావోయిస్టులు  మరణించగా, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ  బస్తర్  డీజీఐ కమలోచన్​ కశ్యప్​ ఆధ్వర్యంలో బీజాపూర్​ ఎస్పీ జితేంద్ర కుమార్​ యాదవ్​, దంతెవాడ ఎస్పీ గౌరవ్​రాయ్, సుక్మా ఎస్పీ కిరణ్​ కుమార్​ చౌహాన్​ల పర్యవేక్షణలో సుమారు 12 వందల మంది డీఆర్​జీ, ఎస్టీఎఫ్​, సీఆర్పీఎఫ్​ జవాన్లు ఈ జాయింట్​ ఆపరేషన్​లో  పాల్గొన్నారు. బలగాలు ఇంకా అడవుల్లోనే ఉండడంతో టెన్షన్  వాతావరణం నెలకొంది. 

మాటువేసి మట్టుబెట్టారు

దక్షిణ బస్తర్​ దండకారణ్యంలోని మావోయిస్టు అగ్రనేతలు కమాండర్​ లింగా, పాపారావు, దక్షిణ బస్తర్​ స్పెషల్ జోనల్​ కమిటీ, డివిజన్​ కమిటీ, ఏరియా కమిటీ లీడర్లు పిడియా అడవుల్లో సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో దక్షిణ బస్తర్​  డీఐజీ కమలోచన్​ కశ్యప్..​ బీజాపూర్, సుక్మా, దంతెవాడ ఎస్పీలను అప్రమత్తం చేశారు. డీఆర్​జీ (డిస్ట్రిక్ట్ ఆర్డ్మ్ గార్డ్), ఎస్టీఎఫ్​(స్పెషల్ టాస్క్ ఫోర్స్), సీఆర్​పీఎఫ్​ 210 బెటాలియన్​కు చెందిన 1,200 మంది మెరికల్లాంటి జవాన్లను ఎంపిక చేసి జాయింట్​ ఆపరేషన్​ చేపట్టారు. మావోయిస్టులు సమావేశమైన ప్రాంతానికి జవాన్లు చేరుకున్నారు. వారి రాకను గమనించిన మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న బలగాలు సమావేశ ప్రాంగణాన్ని రౌండప్​ చేసి కాల్పులు జరిపారు. మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారు. అయినా బలగాలు వారిని వెంటాడడంతో సాయంత్రం వరకు పలు దఫాల్లో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో  12 మంది మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు,ఇతర నిత్యావసర సరుకులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చీకటి పడడంతో బలగాలు దట్టమైన అడవుల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో బ్యాకప్​ బలగాలు ఆ ప్రాంతానికి వెళ్లాయి. పిడియా అడవులు మొత్తం బలగాల ఆధీనంలోనే ఉన్నాయి. తప్పించుకుపోయిన మావోయిస్టు అగ్రనేతలు ఇంకా అడవుల్లోనే ఉన్నారని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఎదురుదాడులకు దిగే ప్రమాదం ఉందని పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. 

నాలుగు నెలల్లో మూడో పెద్ద ఆపరేషన్​

ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్లు నిర్వహించిన జవాన్లు పెద్ద విజయాలను సొంతం చేసుకున్నారు. ఇటీవలే కాంకేర్​ జిల్లాలో 29 మందిని, నారాయణ్​పూర్​లో 10 మంది మావోయిస్టులను హతమార్చారు. తాజాగా 12 మందిని మట్టుబెట్టారు. నాలుగు నెలల కాలంలో 99 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని దక్షిణ బస్తర్​ డీఐజీ కమలోచన్​ కశ్యప్​  మీడియాకు తెలిపారు.