
- జహీరాబాద్ నేతలతో భేటీలో కేసీఆర్ ధీమా
- కాంగ్రెస్‌పై వ్యతిరేకతతోనే ఓట్లు పడతయ్
- జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్?
- ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే చాన్స్
హైదరాబాద్, వెలుగు:లోక్‌సభ ఎన్నికల్లో డజనుకుపైగా స్థానాల్లో గెలుస్తామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన వ్యతిరేకతను పట్టించుకోవద్దని పార్టీ నేతలకు సూచించారు. వివిధ లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కేసీఆర్.. ఆదివారం నందినగర్‌లోని తన నివాసంలో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. అభ్యర్థి ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కే అప్పగిస్తూ నేతలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇప్పటికే సర్కార్‌పై వ్యతిరేకత మొదలైందని, ఆ వ్యతిరేకతనే ఓట్లుగా మలచుకోవాలని కేసీఆర్ సూచించినట్టు సమాచారం. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేటోళ్ల గురించి ఆలోచించొద్దని కూడా చెప్పినట్టు తెలుస్తున్నది.
జహీరాబాద్ అభ్యర్థిగా అనిల్ కుమార్?
జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. ఒకట్రెండు రోజుల్లో ఆయన పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే లింగాయత్ వర్గానికి చెందిన అభ్యర్థులను ప్రకటించాయి. అందువల్ల మున్నూరు కాపు అయిన గాలి అనిల్ కుమార్ సరైన అభ్యర్థి అవుతారని నేతలు అభిప్రాయపడినట్టు తెలిసింది.
త్వరలోనే ఈ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా సమన్వయకర్తలను ఏర్పాటు చేయాలని, ఈ బాధ్యతను హరీశ్ రావుకు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే సంజీవ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. .