చలివాగు కాలువ బాగు చేసుకుంటున్న 1,200 మంది

చలివాగు కాలువ బాగు చేసుకుంటున్న 1,200 మంది

శాయంపేట, వెలుగు: పంటను కాపాడుకోవడానికి రైతులు కూలీలుగా మారారు. రోజుకు 50 మంది చొప్పున 1,200 మంది రైతులు నిత్యం శ్రమదానం చేస్తూ పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండు వారాలుగా ఈ పని చేస్తున్నా ప్రభుత్వంలో గానీ.. ఆఫీసర్లలో గానీ చలనం లేదు. కాలువ వైపు కన్నెత్తి చూడటం లేదు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి వద్ద ఉన్న చలివాగు ప్రాజెక్టు కింద 3,076 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు కింద మూడు మండలాలకు చెందిన 13 గ్రామాల రైతులు వరి పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉంది. కాలువలో గుర్రపు డెక్క, నాచు, చెట్ల పొదలు పెరగడంతో 2,000 ఎకరాలకు నీరందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల గండ్లు పడ్డాయి. ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆయకట్టు రైతులు రోజూ 50 మంది చొప్పున 15 రోజులుగా కాలువలో ఉన్న గుర్రపు డెక్క, నాచు, చెట్లు, మట్టి తొలగిస్తున్నారు. ప్రాజెక్ట్‌‌ కింద ఆయకట్టు రైతులు ప్రభుత్వానికి పన్ను చెల్లించిన సమయంలో మాత్రమే ఆఫీసర్లు కాలువను శుభ్రం చేసినట్లు రైతులు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పన్ను మాఫీ చేసిందని, అప్పటి నుంచి ఆఫీసర్లు కాలువను పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఏవైనా సమస్యలు వస్తే రైతులే తలా కొంత డబ్బులు వేసుకొని పనులు చేసుకునే పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి కాలువను బాగు చేయించాలని కోరుతున్నారు. 

వరి ఎండిపోతోంది

పదెకరాలు కౌలుకు తీసుకొని వరి పంట వేశా. ఇప్పుడు పొట్ట దశకు వచ్చింది. సాగు నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. రైతుల కోసం ఎంతో చేస్తామని అంటున్న ప్రభుత్వం కనీసం కాలువ సాఫు చేయించడం లేదు. ఇప్పటికైనా కాలువ బాగు చేయించి పంటలకు నీరు అందేలా చూడాలి. -  లింగయ్య, రూపురెడ్డిపల్లె, రేగొండ మండలం