న్యూఢిల్లీ : దలాల్‌స్ట్రీట్‌కు కంపెనీలు క్యూ కడుతున్నాయి. సెబీకి మంగళవారం ఒక్క రోజే 13 కంపెనీలు ఐపీఓ దరఖాస్తులు అందజేశాయి. వీటిలో విక్రమ్ సోలార్, ఆదిత్య ఇన్ఫోటెక్, వరీందేరా కన్‌స్ట్రక్షన్స్ సహా డజనుకు పైగా కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ప్రిలిమినరీ పేపర్‌లను దాఖలు చేశాయి. ఈ సంస్థలు కనీసం రూ. ఎనిమిది వేల కోట్లను సమీకరించే అవకాశం ఉంది.
ఈ ఐపీఓల్లో ఫ్రెష్, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉన్నాయి. ఇవన్నీ వివిధ సెక్టార్లకు చెందిన కంపెనీలు. ప్రైమరీ మార్కెట్‌పై కంపెనీలతోపాటు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 62 కంపెనీలు మెయిన్‌బోర్డ్ ఇష్యూల ద్వారా రూ. 64వేల కోట్లను సమీకరించాయి. గత ఏడాది మొత్తం 57 సంస్థలు సేకరించిన రూ. 49,436 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం ఎక్కువ.