కేజ్రీవాల్‌‎కు బిగ్ షాక్.. ఆప్‎కు 13 మంది కీలక నేతల రాజీనామా.. కొత్త పార్టీ ఏర్పాటు

కేజ్రీవాల్‌‎కు బిగ్ షాక్.. ఆప్‎కు 13 మంది కీలక నేతల రాజీనామా.. కొత్త పార్టీ ఏర్పాటు

న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‎కు బిగ్ షాక్ తగలింది. 13 మంది కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‎లో ఆప్ సభా నాయకుడిగా ఉన్న ముఖేష్ గోయెల్‎తో పాటు మరో 12 మంది శనివారం (మే 17) పార్టీని వీడారు. వీరంతా గోయెల్ నాయకత్వంలో ఇంద్రప్రస్థ వికాస్ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. 

ఆప్ ముఖ్య నేతలతో తమను పట్టించుకోవడం లేదని.. అందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‎కు రాజీనామా లేఖను పంపారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గోయెల్ ఆదర్శ్ నగర్ నుంచి ఆప్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 25 సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన గోయెల్ 2021లో కాంగ్రెస్ నుండి ఆప్‌లో చేరారు.

►ALSO READ | పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఎంపీల బృందం.. ఏడుగురు ఎంపీలు వీళ్లే..

2025, ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఆప్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగరేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఆప్ అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో అలర్టైన కేజ్రీవాల్ పార్టీలో నెలకొన్న అసంతృప్తిని తగ్గించడానికి సంస్థాగత మార్పులను చేపట్టారు.

మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను ఆప్ ఢిల్లీ అధ్యక్షుడిగా, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న పంజాబ్ బాధ్యతలను అప్పజెప్పారు. మరో సీనియర్ నేత గోపాల్ రాయ్‌ను గుజరాత్ రాష్ట్ర ఆప్ ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్‌కు ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు.