సికింద్రాబాద్ విధ్వంసం : 13మందికి బెయిల్

సికింద్రాబాద్ విధ్వంసం :  13మందికి బెయిల్

సికింద్రాబాద్ విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన 13మంది ఆర్మీ అభ్యర్థులు జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు వారికి బెయిల్ మంజూరు చేయడంతో రిలీజయ్యారు. జైలు వద్దకు వారి కుటుంబసభ్యులు భారీగా తరలివచ్చారు. తమ వారిని అన్యాయంగా కేసులో ఇరికించారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే ఆవుల సుబ్బారావు రావు సహా మరో 28మంది బెయిల్ పై విడదలయ్యారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం

అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ జూన్ 17న భారీ సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు తరలివచ్చిన ఆర్మీ అభ్యర్థులు ఒక్కసారిగా విధ్వంసానికి దిగారు.  మూడు ఫ్లాట్ ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు నిప్పంటించారు. రైల్వే స్టేషన్ బయట బస్సులపై రాళ్లు రువ్వారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబీర్ పేటకు చెందిన రాకేశ్ అనే 18ఏండ్ల యువకుడు మృతి చెందాడు. మరో 14 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో సుమారు 56 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై సెక్షన్ 143, 147, 324, 307, 435,427, 448, 336, 332, 341, రెడ్ విత్ 149 తో పాటు  ఇండియన్ రైల్వే యాక్ట్ 150, 151, 152, కింద కేసులు నమోదు చేశారు.