తిరుపతిలో పిల్లల కిడ్నాప్ ముఠా.. నిందితుల కోసం స్పెషల్ టీమ్

తిరుపతిలో పిల్లల కిడ్నాప్ ముఠా.. నిందితుల కోసం స్పెషల్ టీమ్

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కిడ్నాప్​ కలకలం రేగింది.  ఓ చిన్నారిని ( 13 నెలల పాప) ఇరుగు పొరుగు వారు అపహరించారని పోలీసులు గుర్తించారు.  ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...

తిరుపతిలో 13 నెలల పాపను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. తల్లి పక్కన ఉండాల్సిన ఆ బిడ్డ ఏ వేదన పడుతుందో తెలియదు కాని..  ఆ బిడ్డ కోసం ఆ పేద తల్లి తల్లడిల్లుతోంది. పాలు తాగే పసిపాపను ఎందుకు కిడ్నాప్ చేశారనేది మిస్టరీగా మారింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు పసిబిడ్డను అపహరించిన నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలచేను వద్ద ఉన్న స్టార్ లైట్ బిల్డింగ్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.  సుచిత్ర అనే మహిళ కుటుంబంతో నివాసం ఉంటుంది. ఈమెకు 13 నెలల కూతురు జయశ్రీ. ఇంటి బయట ఆడుకుంటున్న  బిడ్డ జయశ్రీ ని ఎత్తుకునిపోయారని బాధితురాలు  సుచిత్ర ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు  ఘటన జరిగిన ప్రాంతానికి  సమీపంగా ఉన్న సిసి కెమెరాల పుటేజీని పరిశీలించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఉన్న సిసి ఫుటేజీలను కూడా ఈస్ట్ పోలీసులు పరిశీలించారు.

సీసీటీవీ ఫుటేజ్​ ను పరిశీలించిన పోలీసులు సుచిత్ర ఇంటికి సమీపంలోనే ఉన్న మారెమ్మ, మురుగన్ దంపతులు 13 నెలల పసిపాప జయశ్రీని ఎత్తుకుని వెళ్ళినట్లు గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఈస్ట్ సీఐ శ్రీనివాసులు చెప్పారు.  ప్రత్యేక పోలీసు బృందంతో ఇద్దరికోసం గాలిస్తున్నారు. చిన్నారిని ఎవరికైనా విక్రయించడానికి తీసుకెళ్లారా.? లేక ఏదైనా కారణం ఉందా.? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.