సిటీలోని 13 చెరువుల పరిస్థితి దారుణం.. హైకోర్టుకు అడ్వొకేట్‌ కమిషన్‌ రిపోర్ట్‌

సిటీలోని 13 చెరువుల పరిస్థితి దారుణం.. హైకోర్టుకు అడ్వొకేట్‌ కమిషన్‌ రిపోర్ట్‌

హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ పరిధిలోని13 చెరువుల పరిస్థితి దారుణంగా ఉందని అడ్వొకేట్‌ కమిషన్‌ హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. చెరువుల దుస్థితిపై 2007లో దాఖలైన పిల్‌పై ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టుపై సంతృప్తి చెందని హైకోర్టు అడ్వొకేట్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ గాడి ప్రవీణ్‌ కుమార్, టి. శ్రీకాంత్‌రెడ్డిలతో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రిపోర్టు ఇచ్చింది. చెరువుల ఆక్రమణలు, మురుగునీరు చేరిక, బఫర్‌ జోన్, ఎఫ్‌టీఎల్‌ వంటి సమస్యలపై ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్టులో వివరించింది. చెరువులు చెత్త, ముగురునీరు, దర్వాసనతో దారుణంగా తయారయ్యాయని తెలిపింది. 

ఆ చెరువుల్లోని చేపలను, ఆ నీటితో సాగు చేసే పంటలను తిన్నవాళ్ల ఆరోగ్య పరిస్థితి ప్రమాకరంగా మారుతుందని హెచ్చరించింది. ఆక్రమణల తొలగింపు, కాలుష్య నివారణ చర్యలు, ముగురు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎఫ్‌టీఎల్‌ తుది నోటిపికేషన్‌ జారీ చేయాలని కోరింది. బఫర్‌ జోన్‌లోని పట్టాదారులకు వేరే చోట్ల జాగాలు ఇవ్వడమో, పరిహారం చెల్లించడమే చేసి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని వివరించింది. ఈ పిల్‌ను సీజే బెంచ్‌ విచారణ చేస్తున్నది.