14.35 లక్షల మందికి..రైతుబంధు అందలే!

14.35 లక్షల మందికి..రైతుబంధు అందలే!

రైతులకు పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతు బంధు’ పథకం ఖరీఫ్​ సొమ్ము ఇంకా పెండింగ్​లోనే ఉంది. జూన్​లోనే పైసలు రైతులకు అందాలి. కానీ ఖరీఫ్​ సీజన్​ ముగింపు దశకు వచ్చినా ఇంకా 14 లక్షల మందికిపైగా రైతులకు సొమ్ము అందలేదు. మరికొద్ది రోజులు గడిస్తే యాసంగి సీజన్ మొదలవుతుంది. అక్టోబర్​ నుంచే రెండో విడత రైతు బంధు సొమ్ము రైతులకు అందాల్సి ఉంటుంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ నెల రెండో వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 14.75 లక్షల మంది రైతులకు ఖరీఫ్​ పెట్టుబడి సాయం అందలేదని లెక్కలు చెప్తున్నాయి. అయితే హుజూర్​నగర్​ ఉప ఎన్నిక ఉండటంతో ఆ సెగ్మెంట్​ ఉన్న సూర్యాపేట జిల్లాకు రైతు బంధు నిధులు ఇచ్చారు. ఒక్క రోజే 40 వేల మందికిపైగా రైతులకు సంబంధించి రూ.128 కోట్లను వారి ఖాతాల్లో వేశారు. ఇంకా 14 లక్షల 35 వేల మందికి సొమ్ము రావాల్సి ఉంది. ఇందుకు రూ.2 వేల కోట్లు అవసరమని అంచనా. నిధుల కటకట కారణంగానే సర్కారు రైతు బంధు నిధులు విడుదల చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రెండో విడత సొమ్ము ఎప్పుడిస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆందోళనలో రైతులు..

రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద 56.75 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. మొత్తం రూ.7,254 కోట్లు నిధులు అవసరం. ప్రభుత్వం ఇప్పటివరకు 42 లక్షల మంది రైతులకు రూ.4,862 కోట్లు చెల్లించింది. మిగతా 14.35 లక్షల మంది రైతుబంధు సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో జూన్‌‌లో అందాల్సిన పైసలు ఇంకా ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజూ గ్రామాల్లో రైతుబంధు సొమ్ముకోసం వాకబు చేయడం, ఏఈవోల వద్దకు వెళ్లి ఆరా తీయడం వంటివి చేస్తున్నారు. బ్యాంకులకు వెళ్లి అకౌంట్‌‌లో డబ్బులు పడ్డాయా అని చూసుకుంటున్నారు. కొద్దిరోజులైతే రబీ మొదలవుతుందని, ఆ సొమ్ము కూడా ఎప్పుడు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

హుజూర్‌‌ నగర్‌‌ ఉప ఎన్నికతో..

హుజూర్‌‌ నగర్  అసెంబ్లీ సెగ్మెంట్  ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం రైతుబంధుపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎన్నికల జరిగే సూర్యాపేట జిల్లాకు ఈ పథకం నిధులు విడుదలయ్యాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌‌కు ఒక్క రోజు ముందు ఆర్థిక శాఖ రూ.128 కోట్లను రైతుల ఖాతాలకు విడుదల చేసింది. సూర్యాపేట జిల్లాలో అర్హులైన రైతులు 2 లక్షల 30 వేల మంది ఉన్నారు. వారికి రైతుబంధు చెల్లింపు కోసం రూ.290 కోట్లు అవసరం. నోటిఫికేషన్‌‌ కు ముందు రోజు వరకు లక్షన్నర మందికిపైగా రైతులకు రూ.130 కోట్లు సొమ్ము అందింది. మిగతా వారికి చెల్లించేందుకు మరో రూ.160 కోట్లు అవసరమైతే.. అందులో రూ.128 కోట్లను ఆ ఒక్క రోజే విడుదల చేశారు. ఈ సొమ్ము వేగంగా రైతులకు చేరాలని ఆదేశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో గత మూడు, నాలుగు రోజుల్లోనే 40 వేల మందికిపైగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమకావడం విశేషం.

మిగతా జిల్లాల్లో రైతుల అసంతృప్తి

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి రైతు బంధు సొమ్ము అందాల్సి ఉండగా.. ఉప ఎన్నిక ఉందని ఒక్క జిల్లాకే నిధులు విడుదల చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగతా జిల్లాల రైతులకూ వెంటనే నిధులు విడుదల చేయాలని రైతు సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. మరోవైపు హుజూర్‌‌ నగర్‌‌ ఉప ఎన్నికలో లబ్ధి కోసమే టీఆర్ఎస్​ ప్రభుత్వం రైతు బంధు సొమ్ము ఇలా విడుదల చేసిందని ప్రతిపక్షాల నేతలు కూడా ఆరోపిస్తున్నారు.