టెహ్రాన్: యుద్ధంలో ప్రాణత్యాగం చేయడానికి తనతో సహా 1.4 కోట్ల మంది ఇరాన్ ప్రజలు (వలంటీర్లు) సిద్ధంగా ఉన్నారని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన డెడ్ లైన్ ముగుస్తున్న నేపథ్యంలో పెజెష్కియాన్ ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
"ఈ స్వచ్ఛంద పోరాటంలో ప్రాణాలర్పించడానికి 1.4 కోట్ల కంటే ఎక్కువ మంది ఇరాన్ ప్రజలు తమ సంసిద్ధతను ప్రకటించారు. నేను కూడా ఇరాన్ కోసం నా ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను" అని ఆయన పేర్కొన్నారు. కాగా, యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ప్రభుత్వం టెక్స్ట్ మెసేజ్‌లు, మీడియా ద్వారా సేకరించిన స్వచ్ఛంద సేవకుల సంఖ్య గతంలో ప్రభుత్వ మీడియా పేర్కొన్న గణాంకాల కంటే ఇప్పుడు రెట్టింపు అయ్యింది.
ఇరాన్ లో మొత్తం 9 కోట్ల మంది జనాభా ఉన్నారు. దేశవ్యాప్త నిరసనలపై ప్రభుత్వం గతంలో చేసిన రక్తపాత అణచివేత పట్ల చాలా మంది ప్రజలు ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా హెచ్చరించిన బాంబు దాడుల ప్రచారాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ 1.4 కోట్ల వాలంటీర్ల సంఖ్యను
ఇరాన్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
