సముద్రంలో గల్లంతైన 14 ఏండ్ల బాలుడు.. చెక్కను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు

సముద్రంలో గల్లంతైన 14  ఏండ్ల బాలుడు.. చెక్కను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు

గుర్తించి కాపాడిన మత్స్యకారులు

సూరత్: సముద్రంలో గల్లంతైన 14  ఏండ్ల బాలుడు.. ఓ చెక్కను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. అలా నడి సముద్రంలో ఒకరోజుకుపైగా ఎదురుచూశాడు. మరుసటిరోజు అటుగా మత్స్య కారుల బోటు రావడంతో వాళ్ల సాయంతో క్షేమంగా ఒడ్డుకు చేరాడు. గుజరాత్​లోని సూరత్​లో సోమవారం ఈ ఘటన జరిగింది. సూరత్​కు చెందిన లఖన్​ దేవిపూజక్(14) తన స్నేహితులతో కలిసి గత ఆదివారం మధ్యాహ్నం డుమాస్​లోని బీచ్​కు వెళ్లాడు.

 అక్కడ ప్రమాదవశాత్తు లఖన్ అలల్లో కొట్టుకుపోయాడు. స్థానికులు గజ ఈతగాళ్ల సాయంతో గాలించినా పిల్లాడి ఆచూకీ దొరకలేదు. డుమాస్ పోలీసులు కూడా బాలుడిని కనిపెట్టలేకపోయారు. మరుసటిరోజు సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్న మత్స్యకారుల బోటును గమనించి లఖన్​ కేకలు వేశాడు. 

దీంతో వాళ్లు.. అతనిని బోటులో ఎక్కించుకుని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. గణపతి విగ్రహాలకు వాడే చెక్కను పట్టుకుని నీళ్లలో వేలాడుతున్న లఖన్ ను చూసి తాము ఆశ్చర్యపోయామని మత్స్యకారులు తెలిపారు.