15 నిమిషాలు పోలీసులను తొలగించండి బుక్ రిలీజ్

15 నిమిషాలు పోలీసులను తొలగించండి బుక్ రిలీజ్
  • ప్రేమతోనే దేశం ముందుకెళ్తుంది: మహ్మద్ ముస్తాక్ మాలిక్
  • ఒవైసీ సోదరులు ముస్లింలను.. 
  • జిన్నా లెక్క ఆగం చేస్తరు: రచయిత షేక్​సాలెహ్

ఖైరతాబాద్, వెలుగు: ప్రేమతోనే దేశం ముందుకు పోతుందని.. ద్వేషంతో కాదని.. జనం దాన్ని గుర్తించాలని తహ్రీక్ ముస్లిం షాబాన్ అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ మాలిక్ అన్నారు. షేక్ సాలెహ్ రాసిన ‘15 నిమిషాలు పోలీసులను తొలగించండి’ పుస్తకావిష్కరణ బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. చీఫ్​ గెస్టుగా హాజరైన మహ్మద్ ముస్తాక్ బుక్​ రిలీజ్ చేసి మాట్లాడారు. రచయిత ఈ పుస్తకాన్ని రాయడానికి ప్రేరణ పదేండ్ల కింద ఓ రాజకీయ సభలో ఒవైసీ సోదరులు చేసిన కామెంట్లే అన్నారు. ‘తమ చేతులు కట్టేసి ఉన్నాయి..

15 నిమిషాలు పోలీసులను తొలగించండి’ అప్పుడు చెబుతా అంటూ ఆ సమయంలో అక్బరుద్దీన్ కామెంట్ చేశారన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సెక్రటేరియెట్​సభ్యుడు నర్సింహ మాట్లాడుతూ ‘‘2014 వరకు ఎంఐఎం పార్టీ పాత బస్తీకే పరిమితం. అక్కడ రౌడీషీటర్లు పెరిగిపోయారు. నిరక్షరాస్యతే దానికి కారణం. 40 ఏండ్లుగా ఎంఐఎం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలతోనే కలిసి ఉంది.

అందుకే రౌడీ షీటర్లపై పోలీసు కేసులు నమోదు కాలేదు” అని అన్నారు. మెట్రో రైల్ పాతబస్తీకి ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. అక్కడికి మెట్రో వస్తే వారంతా సిటీలో తిరుగుతారని.. దాంతో వారిలో అభివృద్ధిపై కాంక్ష పెరిగి ఓటింగ్​లో మార్పలు వస్తాయన్నారు. అందుకే పాతబస్తీకి మెట్రో ​రాకుండా ఒవైసీ సోదరులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 

ఎంఐఎంకు మరో పార్టీ సహకరిస్తున్నది

జిన్నా తన ప్రసంగాలతో 1947లో ముస్లింలను ఎక్కడైతే వదిలిపెట్టి ఆగం చేశాడో.. పాత బస్తీలో ఇద్దరు సోదరులు రెచ్చగొట్టే ప్రసంగాలతో ముస్లింలను ఆ దిశగా తీసుకెళ్తున్నారని రచయిత షేక్​సాలెహ్ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. పాతబస్తీలో ప్రస్తుతం కొనసాగుతున్న సంస్కృతిని దేశవ్యాప్తం చేయాలని ఆ ఇద్దరు భావిస్తున్నారని తెలిపారు. వారి అరాచకాలకు పరోక్షంగా మరో పార్టీ సహకరిస్తున్నట్లు తెలిపారు. తెలుగు, ఉర్దూలో ఈ పుస్తకం అందుబాటులో ఉంటుందని తెలిపారు.