15 నిమిషాల వర్షానికే ఆగమాగం

15 నిమిషాల వర్షానికే ఆగమాగం

గురువారం సాయంత్రం ఒక్కసారిగా మొదలైన గాలివానతో సిటీ జనం ఇబ్బంది పడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, తీవ్ర ఉక్కపోత ఉండగా.. సాయంత్రం ఈదురుగాలులతో 15 నిమిషాల పాటు వర్షం కురిసింది. కొన్ని బస్తీలు, కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. ఎక్కడిక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. నాంపల్లిలోని ఎల్ అండ్ టీ కన్​స్ట్రక్షన్​ సైట్​లోని షెడ్ రేకులు గాలి బీభత్సానికి పై అంతస్తు నుంచి ఎగిరి మెయిన్ రోడ్డుపై వెళ్తున్న వెహికల్స్​పై పడ్డాయి. మూడు కార్లు డ్యామేజ్ అవ్వగా, ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఫిలింనగర్, షేక్ పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి,  ఏఎస్​రావునగర్, మలక్ పేట, కుర్మగూడ, కంచన్ బాగ్, గుడిమల్కాపూర్ ప్రాంతాల్లో గాలివాన బీభత్సానికి కాలనీల్లో, రోడ్ల పక్కన చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలుస్తోందని షేక్ పేట్ బాలాజీనగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. షేక్ పేటలో 1.28సెం.మీలు, గోల్కొండలో 1.1సెం.మీలు, గచ్చిబౌలిలో 1.03 సెం.మీల వర్షపాతం నమోదైంది వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండ్రోజుల పాటు సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే చాన్స్ ఉందని చెప్పారు. గంటకు 8 నుంచి 12 కి.మీ  వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.