రాష్ట్రంలో మరో 1550 మందికి కరోనా

రాష్ట్రంలో మరో 1550 మందికి కరోనా
  • గ్రేటర్‌‌లో 926, జిల్లాల్లో 624 కేసులు
  • మరో 9 మంది మృతి
  • గాంధీ ఆస్పత్రిలో ఖాళీగా 1,013 బెడ్లు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో మరో 1,550  కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం 11,525 మందికి టెస్ట్ చేస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో 926 మందికి, జిల్లాల్లో 624 మందికి పాజిటివ్ వచ్చినట్టు బులెటిన్​లో  హెల్త్​ డిపార్ట్​మెంట్​ ప్రకటించింది. జిల్లాల్లో ఎక్కువగా రంగారెడ్డిలో 212, కరీంనగర్‌‌లో 86, మేడ్చల్‌లో 53, నల్గొండలో 41, ఖమ్మంలో 38, కామారెడ్డిలో 33, సంగారెడ్డిలో 19, వరంగల్ అర్బన్‌లో 16 కేసులు నమోదయ్యాయి. మరో 20 జిల్లాల్లో 15 కంటే తక్కువ కేసులు వచ్చాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 36,221కి చేరినట్టు హెల్త్​ డిపార్ట్​మెంట్​ వెల్లడించింది. ఇందులో 23,679 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 12,178 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ప్రకటించింది.  యాక్టివ్ పేషెంట్లలో1,844 మంది ప్రభుత్వ దవాఖాన్లలో ట్రీట్​మెంట్​ పొందుతున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. కరోనాతో శనివారం మరో 9 మంది చనిపోయారని, మొత్తం మరణాల సంఖ్య 365కు పెరిగిందని వివరించింది.

గాంధీలో 1,013 బెడ్లు ఖాళీ

గాంధీ హాస్పిటల్‌లో 1,890 బెడ్లు ఉండగా.. ప్రస్తుతం 877 మంది ఇన్‌ పేషెంట్లు ఉన్నారని, మరో 1,013 బెడ్లు ఖాళీగా ఉన్నాయని బులెటిన్‌లో హెల్త్​ డిపార్ట్​మెంట్​ పేర్కొంది. సోమవారం రాత్రి గాంధీలో డ్యూటీలకు హాజరయ్యేందుకు వచ్చిన నర్సులను పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డులు చూపించాలని కోరారు. కొత్తగా జాయిన్ అయ్యామని, ఐడీలు ఇవ్వలేదన్నా వినలేదు. చివరకు ఓ పేపర్‌‌పై పేర్లు, వివరాలు రాయించుకుని, హాస్పిటల్ అధికారుల పర్మిషన్ తీసుకుని పంపినట్టు తెలిసింది.

వెబ్‌సైట్‌లో  జీహెచ్​ఎంసీ పేషెంట్ల వివరాలు

జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదైన కరోనా కేసుల వివరాలను సోమవారం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. పేషెంట్‌ నంబర్‌‌, జెండర్‌‌, ఆ వ్యక్తి ఇల్లు ఉన్న జోన్‌, సర్కిల్ వివరాలు అందులో పేర్కొన్నారు. ఇందులో చివరి పేషెంట్ ఐడీ 37,576 కాగా.. బులెటిన్​లో ప్రకటించిన రాష్ట్రంలోని కేసులు 36,221 మాత్రమే కావడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయని కేసులు వేలల్లో ఉన్నాయి.

తెలంగాణలోని కరోనా కేసుల్లో తిరకాసు