AI News: మాకు ఎక్కువమంది ఉద్యోగులు అక్కర్లేదు.. ఏఐ బాగుంది: అమెజాన్ సీఈవో

AI News: మాకు ఎక్కువమంది ఉద్యోగులు అక్కర్లేదు.. ఏఐ బాగుంది: అమెజాన్ సీఈవో

Amazon: మానవ జీవిత పరిణామంలో ఇంటర్నెట్ సేవలు పెద్ద మలుపుగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రస్తుతం వస్తున్న ఏఐ యుగం ప్రజల జీవితాలకు మరో మార్పుగా టెక్ నిపుణులు చెబుతున్నారు. కొందరు ఏఐ వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని అంటున్నప్పటికీ.. చాపకింద నీరులా దాని విస్తరణ కొనసాగుతున్న వేళ వాస్తవ ప్రమాదాలపై చాలా మంది ఒప్పుకుంటున్నారు. 

అయితే ఏఐ వల్ల ఉన్న ప్రమాదం గురించి అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తాజాగా తమ కంపెనీ ఉద్యోగులకు చెప్పారు. ఏఐ వినియోగం, అభివృద్ధి పెరుగుతున్న వేళ భవిష్యత్తులో ఉద్యోగుల సంఖ్య అమెజాన్ లో భారీగా తగ్గుతుందని జెస్సీ వెల్లడించారు. రోజువారీ పనుల్లో జనరేటివ్ ఏఐ, ఏఐ ఏజెంట్ల వినియోగాన్ని పెంచుతున్నామని, ఇది ఉద్యోగాల్లో కీలక మార్పులకు దారితీస్తుందన్నారు. అందువల్ల భవిష్యత్తులో తక్కువ మంది ఉద్యోగులు ఇప్పుడు ఉన్న పనులను చేసేందుకు సరిపోతారని ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొన్నారు.

ఈ కారణంగా రానున్న కొన్ని సంవత్సరాల్లో అమెజాన్ ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గుతుందని స్పష్టం చేశారు జెస్సీ. గడచిన మూడేళ్ల కాలంలో కంపెనీ దాదాపు 27వేల మంది ఉద్యోగులను ప్రపంచ వ్యాప్తంగా తగ్గించుకుంది. అయితే ఏఐ వాడకంతో రానున్న కాలంలో ఈ కోతలు మరింతగా పెరుగుతాయని అన్నారు. ఇంటర్నెట్ ఆవిర్భవించినప్పటి నుంచి ప్రస్తుతం వచ్చిన జనరేటివ్ ఏఐ అత్యంత శక్తివంతమైన మార్పుల్లో ఒకటని అన్నారు. తాము ప్రస్తుతం ఏఐని అంతర్గత వినియోగంతో పాటు కస్టమర్ల కోసం కూడా డెవలప్ చేస్తున్నట్లు జెస్సీ వెల్లడించారు. ఇది కస్టమర్ ఎక్స్ పీరియన్స్ పెంచటంతో పాటు భవిష్యత్తులో ఖర్చులను తగ్గించుకోవటానికి దోహదపడుతుందన్నారు.