
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1554 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈ ఒక్క రోజే 9 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 49,259కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 438కి పెరిగింది. ఈ ఒక్క రోజులో 1281 మంది కరోనా నుంచి కోలుకున్నారని, దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 37,666కి చేరిందని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. ప్రస్తుతం 11,155 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 842 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 96, కరీంనగర్‌లో 73, నల్లగొండలో 51, వరంగల్ అర్బన్‌లో 38, వరంగల్ రూరల్‌లో 36 మంది చొప్పున కరోనా బారినపడ్డారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా రికవరీ రేటు 76.5 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 0.88 శాతానికి తగ్గిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.