16 రోజుల పసికందును ఎత్తుకెళ్లింది
ఖమ్మం దవాఖానలో పాలు ఇస్తానంటూ ఎత్తుకెళ్లిన మహిళ
సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
ఖమ్మం , వెలుగు: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వాస్పత్రిలో 16 రోజుల పసికందు మాయమైంది. జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గుర్తు తెలియని మహిళ ఓ పసిపాపను ఎత్తుకెళ్లింది. ఖమ్మం జిల్లాలోని వేంసూరు మండలం కందు కూరుకు చెందిన నాగరాజు, రమాదేవి దంపతులకు ఇప్పటికే ఏడాదిన్నర బాబు ఉండగా, రెండో కాన్పు లో ఈ నెల 9న పాప జన్మించింది. పాప 2.2 కిలోల బరువు మాత్రమే ఉండడం, ఆయాస పడుతుండడంతో వేంసూరు డాక్టర్లు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 10న పాపను ఖమ్మం ఆస్పత్రిలోని ఎస్ఎన్‌సీలో చేర్పించారు. తల్లి రమాదేవి, అమ్మమ్మ సావిత్రమ్మ ఆస్పత్రిలో ఉన్నారు.
మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని మహిళ వీళ్లున్న గదిలోకి వచ్చింది. పాప ఎందుకు ఏడుస్తుందంటూ సావిత్రమ్మతో మాటలు కలిపింది. తల్లికి పాలు పడలేదని, ఆకలితో ఏడుస్తుందని చెప్పగా, తన బిడ్డను బాక్సులో పెట్టారని అప్పటివరకు తాను పాలిస్తానంటూ సావిత్రమ్మ దగ్గర నుంచి పాపను తీసుకుంది. వచ్చిన మహిళను నమ్మిన రమాదేవి తెల్లవారడంతో మొహం కడుక్కునేందుకు వెళ్లగా, సావిత్రమ్మ బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ఈలోగా నర్సు చెప్పడంతో ఆ మహిళ పాపను తీసుకెళ్లి ఇంజక్షన్ వేయించింది. ఆస్పత్రి ఆవరణలోనే పాపకు ఒళ్లు తుడిచేందుకు వేడి నీళ్లు తీసుకొని వచ్చింది.
సావిత్రమ్మ పని ముగించుకొని వచ్చేలోగా గదిలో పాపకు పాలిస్తూ మహిళ కనిపించడంతో ఇడ్లీ తెచ్చేందుకు మరోసారి బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేలోగా పాపకు ఎండ పడతానంటూ ఆ మహిళ బయటకు తీసుకువెళ్లింది. కొద్దిసేపటికి సావిత్రమ్మ వెళ్లి చూసేసరికి ఆ మహిళ కనిపించలేదు. పాప కోసం తల్లి, అమ్మమ్మలిద్దరూ ఆస్పత్రి మొత్తం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో జరిగిన విషయాన్ని సిబ్బందికి వివరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రిలో సీసీ ఫుటేజీ ఆధారంగా పాపను తీసుకెళ్లిన మహిళ కోసం గాలిస్తున్నారు. మహిళను గుర్తించేందుకు పోలీసులు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు.
