RGV-PrakashRaj: శివాజీ వ్యాఖ్యలను 'నిర్భయ' నిందితుడితో పోల్చిన ఆర్జీవీ.. అనసూయకు అండగా ప్రకాష్ రాజ్!

RGV-PrakashRaj: శివాజీ వ్యాఖ్యలను 'నిర్భయ' నిందితుడితో పోల్చిన ఆర్జీవీ.. అనసూయకు అండగా ప్రకాష్ రాజ్!

టాలీవుడ్ నటుడు శివాజీ  మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెను తుఫాను సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ వివాదం ఇప్పుడు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధానికే దారితీసింది. ముఖ్యంగా నటి అనసూయ భరద్వాజ్, సింగర్ చిన్మయిలు ఈ అంశంపై గొంతు విప్పడం మరింత వివాదంగా మారింది. వారికి ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు.  లేటెస్ట్ గా  నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు తెలపడం.. మరోవైపు ఆర్జీవీ తనదైన శైలిలో విరుచుకుపడటంతో ఈ అంశం  సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

అనసూయకు మద్దతుగా..

శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టిన నటి అనసూయ భరద్వాజ్‌పై నెట్టింట ఒక వర్గం ట్రోలింగ్‌కు దిగింది. ఆమె వ్యక్తిత్వాన్ని హేళన చేస్తూ కొందరు పోస్టులు పెడుతుండటంతో, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగారు. అనసూయకు మద్దతుగా ఆయన తన ఎక్స్  వేదికగా ఒక పవర్‌ఫుల్ పోస్ట్ చేశారు. "సంస్కారులు అని పిలవబడే వారిని మొరుగుతూనే ఉండనివ్వండి. అది వారి నీచమైన మనస్తత్వానికి నిదర్శనం. డియర్ అనసూయ.. నువ్వు ధైర్యంగా నిలబడు. మేమంతా నీకు అండగా ఉంటాం. నీకు మరిన్ని శక్తులు రావాలని కోరుకుంటున్నాను అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. 

 

 'నిర్భయ' నిందితుడితో పోల్చిన ఆర్జీవీ..

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ఈ విషయంలో అత్యంత కటువుగా స్పందించారు. కేవలం విమర్శించడమే కాకుండా, శివాజీ వ్యాఖ్యలను 2012 నిర్భయ కేసు నిందితుడు జైలు నుంచి చేసిన వ్యాఖ్యలతో పోలుస్తూ ఒక పోస్ట్ షేర్ చేశారు. నిర్భయ కేసులో నిందితుడు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పద్ధతి గల అమ్మాయిలు రాత్రి 9 గంటల తర్వాత బయట తిరగరు. అత్యాచారాల్లో అమ్మాయిలదే తప్పు ఉంటుంది అని అన్నాడు. సరిగ్గా ఇలాంటి భావజాలమే ఇప్పుడు శివాజీ మాటల్లో కనిపిస్తోందని ఆర్జీవీ పరోక్షంగా సెటైర్ వేశారు. మహిళలపై వివక్ష చూపే ఇలాంటి మాటలు సమాజానికి చేటు తెస్తాయని వర్మ మండిపడ్డారు.

ALSO READ : హైదరాబాద్లో పట్టుబడ్డ నైజీరియన్ డ్రగ్స్ ముఠా..

 

మహిళా కమీషన్ ముందుకు శివాజీ

మరో వైపు డిసెంబర్ 27, 2025న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట శివాజీ  విచారణకు హాజరయ్యి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. శివాజీ వాఖ్యల వల్ల భాధపడ్డవారి తరుపున కమిషన్ ప్రశ్నలు వేసి, ఆయన స్టేట్‌మెంట్ను రికార్డ్ చేసుకుంది. ఈ క్రమంలో మహిళా కమిషన్ విచారణ అనంతరం, నటుడు శివాజీ తనపై జరుగుతున్న విమర్శలపై స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, మహిళలను అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. “నేను ఎవరినీ నొప్పించాలని మాట్లాడలేదు. సంస్కృతి గురించి చెప్పాలన్న ఉద్దేశం మాత్రమే ఉంది. కానీ నా మాటలు వక్రీకరించబడ్డాయి” అని శివాజీ తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని అన్నారు. అలాగే, నేను ఏం తప్పు చేసానని నా మీద ఇంత కోపం చూపిస్తున్నారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పినందుకు ఇంత పెద్ద వివాదం చేయడం బాధాకరమని అన్నారు.

వివాదం నేపథ్యం ఏమిటి?

' దండోరా' మూవీ ఈవెంట్ లో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు వేసుకునే దుస్తుల గురించి కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అవి వారి హుందాతనాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అనసూయ , చిన్మయి సోషల్ మీడియాలో స్పందించారు. అప్పటి నుండి శివాజీ మద్దతుదారులకు, అనసూయ అభిమానులకు మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి. ఒకవైపు సంప్రదాయాల పేరుతో సమర్థించే వారు, మరోవైపు ఆధునిక స్వేచ్ఛను కోరుకునే వారు ఈ చర్చలో తలపడుతున్నారు