పెట్రో​ రేట్లను 16 రాష్ట్రాలు తగ్గిచ్చినయ్​

పెట్రో​ రేట్లను 16 రాష్ట్రాలు తగ్గిచ్చినయ్​
  • 6 యూటీల్లోనూ భారీ తగ్గుదల
  • కేంద్రం సూచనతో వ్యాట్​ను తగ్గించిన ఆయా రాష్ట్రాలు
  • ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోని తెలంగాణ
  • కర్నాటకలో లీటర్​ పెట్రోల్​ రూ. 100.58, డీజిల్​ రూ.85.01

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌‌పై రూ.5, లీటరు డీజిల్‌‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ ట్యాక్స్​ను తగ్గించడంతో దేశమంతటా పెట్రో ధరలు దిగివచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్​ను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని కేంద్రం సూచించడంతో.. ఇప్పటివరకు 16 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ముందుకు వచ్చాయి. వ్యాట్​ను తగ్గించిన రాష్ట్రాల్లో ఎక్కువగా బీజేపీ, దాని భాగస్వామ్య రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటిరెండు మినహా అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోలు ధర రూ. 100 కంటే తక్కువకు చేరింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వ్యాట్‌ను అతి తక్కువగా తగ్గించగా.. లడఖ్‌లో అత్యధికంగా తగ్గించారు. ఉత్తరాఖండ్‌లో లీటరు పెట్రోల్‌పై రూ. 1.97,  లడఖ్​లో రూ. 8.70 వరకు తగ్గించారు. ఉత్తరాఖండ్‌లో డీజిల్‌పై వ్యాట్‌ను రూ. 17.5 వరకు తగ్గించగా.. లడఖ్‌లో రూ. 9.52 వరకు తగ్గించారు. శుక్రవారం వరకు కర్నాటక, పుదుచ్చేరి, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, సిక్కిం, బీహార్, మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, దాద్రా నగర్ హవేలీ, డామన్  డయ్యూ, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్,  లడఖ్  వ్యాట్‌ను తగ్గించాయి.

ఏయే రాష్ట్రాల్లో ఎంతంటే ?
వ్యాట్ తగ్గింపు వల్ల కర్నాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 8.62, డీజిల్ రేటు రూ. 9.40 తగ్గింది. ఇక్కడ ఎక్సైజ్​ ట్యాక్స్​ తగ్గింపుతో కలుపుకొని లీటర్​ పెట్రోల్​ ధర రూ. 100.58కు, లీటర్​ డీజిల్​ ధర రూ. 85.01 కు చేరింది. మధ్యప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ. 6.89,  డీజిల్‌పై రూ. 6.96 వ్యాట్​ తగ్గించారు. ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ. 6.96, డీజిల్‌పై రూ.  2.04 వ్యాట్‌ను తగ్గించారు. అయితే కాంగ్రెస్,  దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్  తమిళనాడులో వ్యాట్‌ను మార్చలేదు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా,  తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్‌లో వ్యాట్‌ ఎప్పట్లాగే ఉంది.  ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్ ధర రూ. 5.70 నుంచి రూ. 6.35 వరకు, డీజిల్ ధర రూ. 11.16 నుంచి రూ.12.88 వరకు తగ్గింది. రాష్ట్రాలు పెట్రో ప్రొడక్టుల బేస్‌ ధరపై లోకల్‌ సేల్స్‌ ట్యాక్స్‌/వ్యాట్‌ను వసూలు చేస్తుండగా,  కేంద్రం ఎక్సైజ్ సుంకం విధిస్తుంది.  ఢిల్లీ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీలో లీటర్‌కు రూ. 5 వరకు ఉండగా, డీజిల్‌పై  లీటర్‌కు రూ. 10 వరకు ఉంటుంది. డీజిల్‌పై ఎక్కువ వ్యాట్ ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి. ఎక్సైజ్‌ ట్యాక్స్‌ తగ్గడం వల్ల దేశరాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 6.07,  డీజిల్‌ ధర రూ. 11.75కు పడిపోయింది.  మనదేశంలో రాజస్థాన్‌లో పెట్రోల్‌ ధర అత్యధికంగా ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీలో మార్పుల తరువాత అక్కడ పెట్రోల్   రూ. 111.10కు చేరింది.