వెంటబడ్డాడని మందలిస్తే.. 16 ఏళ్ల అమ్మాయిని నరికేశాడు

V6 Velugu Posted on Jul 13, 2021

న్యూఢిల్లీ: అమ్మాయి వెంటపడిన యువకుడిని ఆమె తండ్రి మందలించాడు. అయినా వినకుండా ఆమెను పదే పదే వెంటాడుతూ ఇబ్బంది పెడుతుండడంతో అతడిని చెంపదెబ్బ కొట్టి మరోసారి ఇలా చేయొద్దని హెచ్చరించాడు. కానీ ఆమె తండ్రిపై కోపంతో రగిలిపోయిన ఆ యువకుడు ఉన్మాదిలా మారి, అమ్మాయిపై గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని మోతీ బాగ్‌ ప్రాంతంలో జరిగింది.
మోతీ బాగ్‌లోని జేజే క్లస్టర్‌‌లో నివసించే పండ్ల వ్యాపారి కుమార్తె పదకొండో తరగతి చదువుతోంది. 16 ఏండ్ల ఆ అమ్మాయిని కొద్ది నెలలుగా తమ పక్కింట్లో ఉండే ప్రదీప్‌ (21) అనే యువకుడు వెంటపడుతూ వేధిస్తున్నాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన ఆ అమ్మాయి.. తన తండ్రికి ఈ విషయం చెప్పింది. దీంతో ఆయన ప్రదీప్‌ను మందలించాడు. అయినా అతడి తీరు మారలేదు. దీంతో చెంపదెబ్బ కొట్టి మరోసారి తన కూతురిని ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించాడు. దీనిని మనసులో పెట్టుకున్న ప్రదీప్ అతడిపై పగ పెంచుకున్నాడు. దీంతో సోమవారం సాయంత్రం గొడ్డలి తీసుకుని వెళ్లి ఆ అమ్మాయి ముఖంపై నరికి పారిపోయాడు. తీవ్రగాయాలైన ఆమెను తల్లిదండ్రులు సఫ్దర్‌‌గంజ్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక మంగళవారం మధ్యాహ్నం మరణించింది.
పరారై హర్యానాలో నక్కిన ప్రదీప్..
ఈ ఘటనపై సోమవారం రాత్రి కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలిక ఫ్యామిలీ, ప్రదీప్ తల్లిదండ్రులను విచారించారు. ఆ తర్వాత ఆ పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు.  ఆ ఫుటేజ్, సెల్‌ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు పారిపోయి హర్యానాలోని పల్వాల్‌లో ఉన్నట్టు గుర్తించారు. అక్కడున్న తన అక్క ఇంట్లో ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై మొదట పెట్టిన హత్యాయత్నం కేసును మర్డర్ కేసుగా మార్చి, ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పారు.

Tagged murder, Girl, Pradeep, NeighbourAttack, DelhiGirl

Latest Videos

Subscribe Now

More News