రాష్ట్రంలో 16,142 టీచర్ పోస్టులు ఖాళీ!

రాష్ట్రంలో 16,142 టీచర్ పోస్టులు ఖాళీ!

1,731 హెడ్మాస్టర్ కొలువులు కూడా.. ఎంహెచ్ఆర్డీ అధికారిక లెక్కల్లో వెల్లడి
రిక్రూట్మెంట్ కాదు.. కేవలం అంచనాల కోసమే అంటున్న ఆఫీసర్లు
టీఆర్టీ-2017 పోస్టు లనే ఇంకా పూర్తిగా భర్తీ చేయని సర్కారు
వెంటనే టీచర్ల రిక్రూట్మెంట్ చేపట్టాలని నిరుద్యోగుల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలపై ఓ స్పష్టత వచ్చింది. మొత్తం 16,142 టీచర్ పోస్టులతో పాటు 1,731 హెడ్మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కతేలింది. అయితే ఈ వివరాలు ఈ పోస్టుల భర్తీ కోసం కాదని.. కేవలం లెక్కల కోసమేనని ఉన్నతాధికారులు చెప్తున్నారు. టీచర్ పోస్టులను భర్తీ చేసే ఉద్దేశంలో రాష్ట్ర సర్కారు లేదని అంటున్నారు.

ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా..

రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ కూడా టీచర్ పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. 2017 అక్టోబర్ లో 8,792 టీచర్ పోస్టులతో సర్కారు టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానీ కోర్టు కేసులు, ఇతర సమస్యల పేరుతో ఇప్పటికీ కొన్ని పోస్టులు భర్తీకాలేదు. పైగా ప్రతినెలా రిటైర్మెంట్లతో పోస్టులు ఖాళీ అవుతూనే ఉన్నాయి. మరోవైపు టీచర్ పోస్టులు ఖాళీగా లేవని.. స్టూడెంట్ల రేషియోతో పోలిస్తే టీచర్లు ఎక్కువగా ఉన్నారని సర్కారు పెద్దలు చెప్తూ వస్తున్నారు. తాజాగా ఎంహెచ్ఆర్డీ రిలీజ్ చేసిన అధికారిక లెక్కల్లోఖాళీల వివరాలు వెల్లడించారు.

ప్రైమరీలోనే 6,247 పోస్టులు ఖాళీ

రాష్ట్రంలో మొత్తం 1,32,432 శాంక్షన్డ్ టీచర్ పోస్టులుండగా.. 1,16,290 మంది టీచర్లు పనిచేస్తున్నారు. మరో 16,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రైమరీ లెవల్ లో 62,696 పోస్టులకు 57,900 మంది పనిచేస్తుండగా.. 4,796 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రైమరీ హెడ్ టీచర్లు శాంక్షన్ పోస్టులు 4,411 ఉండగా.. 1,451 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూపీఎస్ లెవల్లో39,870 శాంక్షన్ పోస్టులుండగా.. 34,600 మంది టీచర్లు వర్క్ చేస్తున్నారు. ఇంకా 5,270 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైస్కూల్ స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉంది. 25,455 శాంక్షన్ పోస్టులకు 20,830 మందే పనిచేస్తున్నారు. మరో 4,625 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టులు కూడా పెద్ద సంఖ్యలోనే ఖాళీగా ఉన్నాయి. మొత్తం 4,835 శాంక్షన్ పోస్టులుంటే.. 3,112 మంది వర్క్ చేస్తున్నారు. 1,731 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

రిక్రూట్మెంట్ లేదు..ప్రమోషన్లు లేవు
ఖాళీగా ఉన్న ప్రైమరీ టీచర్ (ఎస్జీటీ) పోస్టులను రిక్రూట్మెంట్ టెస్టుల ద్వారా భర్తీ చేస్తారు. హైస్కూల్ టీచర్ (ఎస్ఏ) పోస్టుల్లో 30శాతమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. మిగతా 70శాతం పోస్టులను ఎస్జీటీల నుంచి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. హెడ్మాస్టర్ పోస్టులన్నీ ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు. కానీ ఏండ్ల నుంచి ప్రమోషన్లు లేకపోవడంతో అవన్నీ ఖాళీగా ఉన్నాయి. మిగతా పోస్టులను భర్తీ చేసే ఆలోచనలో సర్కారు లేదని అధికారులు చెప్తున్నారు. ఇక ఖాళీ పోస్టుల్లో కొన్ని గురుకుల టీచర్ పోస్టులు కూడా ఉన్నాయని అంటున్నారు. ఎంహెచ్ఆర్డీ ప్రకటించిన టీచర్ పోస్టుల ఖాళీలకు అనుగుణంగా..వెంటనే మరో టీఆర్టీనిర్టీ వేయాలని నిరుద్యోగ,యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం..