
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 15,445 శాంపిల్స్ పరీక్షించగా.. 1640 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈ ఒక్క రోజే 8 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 52,466కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 455కి పెరిగింది. ఈ ఒక్క రోజులో 1007 మంది కరోనా నుంచి కోలుకున్నారని, దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 40,334కి చేరిందని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. ప్రస్తుతం 11,677 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా రికవరీ రేటు 76.8 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 0.86 శాతానికి తగ్గిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా పేషెంట్ల కోసం రాష్ట్రంలో 15,216 బెడ్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 15,445 శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు 3,22,326 కరోనా టెస్టులు చేసినట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 15.5 శాతంగా ఉందని వెల్లడించింది.