
హైదరాబాద్, వెలుగు: పంట చేతికొచ్చే టైమ్‌లో కురుస్తున్న చెడగొట్టు వానలు రైతులను నిండా ముంచేస్తున్నాయి. అకాల వర్షాలకు ఈ సీజన్లో ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 10 లక్షల ఎకరాల్లో పత్తి, ఆరు లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఆగస్టు, సెప్టెంబర్లలో కురిసిన వర్షాలకు భారీగా పంటలు దెబ్బతినగా.. ఇప్పుడు మరింతగా డ్యామేజ్ అవుతోంది. దీంతో ఆరుగాలం కష్టించిన రైతన్నలకు కన్నీళ్లు మిగులుతున్నాయి.
2 రోజుల్లో 2 లక్షల ఎకరాలు
ఈ ఏడాది 1.32 కోట్ల ఎకరాల్లో సాగు జరిగింది. ఇందులో 52.77లక్షల ఎకరాల్లో వరి, 60.33 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. వర్షాల వల్ల ఈ సీజన్ లో 10 లక్షల ఎకరాల్లో పత్తి, 6 లక్షల ఎకరాల్లో వరి మునిగిపోయింది. మొత్తంగా 17 లక్షల ఎకరాల నష్టం జరిగినట్లు సమాచారం. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరి, పత్తి, సోయా, మిరప, కంది, మొక్కజొన్న పంటపై ప్రభావం ఎక్కువ పడింది. రెండు రోజుల్లోనే సుమారు రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని సమాచారం.
వరి దొడ్డు రకాలపై ఎఫెక్ట్
రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వరి వేశారు. ఇందులో కోతకొచ్చిన 1010 రకం పంటకు భారీగా ఎఫెక్ట్ పడిందని అధికారులు గుర్తించారు. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు బికనూర్, కామారెడ్డి, చేగుంట, మెదక్, నిజామాబాద్ ప్రాంతాల్లో వరి పంట దెబ్బతింది. సోమవారం వనపర్తి, నాగర్ కర్నూల్, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, కుమ్రంబీమ్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగినట్లు సమాచారం.
సోయా, మక్క, మిరప పంటలకూ నష్టమే
ఆది, సోమవారాల్లో కురిసిన వానలు చాలా జిల్లాల్లో వరితో పాటు, పత్తి, సోయా, మొక్కజొన్న, మిరప పంటలపై ప్రభావం చూపాయి. బోధన్, బాన్సువాడ, బికనూర్, ముధోల్, భైంసా ప్రాంతాల్లో సోయా పంటకు నష్టం జరిగినట్లు గుర్తించారు. పెద్దపల్లి, మెదక్, నిర్మల్, జనగామ, నల్గొండ, యాదాద్రి, సిరిసిల్ల, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో పంట నష్టం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో మిర్చి పంట ఎక్కువగా డ్యామేజ్ అయింది.