- ఆయన క్షేమంగా,ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటన
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా,-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తొలిరోజే కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడ్డారంటూ వస్తున్న వార్తలపై ఇరాన్ ప్రభుత్వం స్పందించింది. మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం క్షేమంగా.. ఆరోగ్యంగా ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుమారుడు యూసుఫ్ పెజెష్కియాన్ వెల్లడించారు. మొజ్తబా ఖమేనీ గాయపడ్డారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న యూసుఫ్ పెజెష్కియాన్ తన టెలిగ్రామ్ చానెల్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చారు.
‘‘మిస్టర్ మొజ్తబా ఖమేనీ గాయపడ్డారని నేను విన్నాను. దీనిపై సంబంధిత వర్గాల ద్వారా ఆరా తీశాను. దేవుడి దయ వల్ల ఆయన క్షేమంగా ఉన్నారని వారు నాకు సమాచారం అందించారు” అని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్.. మొజ్తబాను ‘రంజాన్ యుద్ధంలో గాయపడిన వీరుడు’ అని పేర్కొన్నప్పటికీ, ఆయనకు తగిలిన గాయాల గురించి స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.
కాగా.. అమెరికా,- ఇజ్రాయెల్ ఆపరేషన్ తొలిరోజే మొజ్తాబా తన భార్య, తండ్రి ఖమేనీతో సహా పలువురు కుటుంబసభ్యులను కోల్పోయారు. అదే సమయంలో జరిగిన దాడుల్లో మొజ్తబా కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని ‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనాన్ని ప్రచురించింది.ఈ దాడుల్లో మొజ్తాబా కూడా గాయపడినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. అయితే, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
ఇటీవల సుప్రీం నేతగా మొజ్తాబా ఎన్నికయ్యారు. అయినా ఆయన నుంచి గానీ, ఆయన కార్యాలయం నుంచి గాని ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో మొజ్తాబా ఆరోగ్యంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా ఇరాన్ ప్రెసిడెంట్ కుమారుడి ప్రకటనతో ఆయన ఆరోగ్యంపై నెలకొన్న సందిగ్ధతకు తాత్కాలికంగా తెరపడింది.
మొజ్తబాకు రక్షణగా ‘బ్లాక్ క్లాడ్’ కిల్లర్ స్క్వాడ్
ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబాకు రక్షణగా ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన, క్రూరమైన ఎలైట్ కౌంటర్ టెర్రరిజం యూనిట్ ‘ఎన్‌ఓపీఓ’ను రంగంలోకి దించింది. ఎన్‌ఓపీఓ అంటే ‘నిరూయే విజే పాస్దరస్ వెలాయత్’.. అంటే పర్షియన్ భాషలో సుప్రీం లీడర్‌ను రక్షించే ప్రత్యేక దళం. ఇది 1991లో ఏర్పాటైంది.
ఇరాన్ స్పెషల్ యూనిట్స్ కమాండ్ కింద పనిచేస్తుంది. నలుపు రంగు దుస్తులు ధరించే వీరిని ‘బ్లాక్- క్లాడ్’ ఫోర్స్‌గా పిలుస్తారు. వీరు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కంటే అత్యంత నైపుణ్యం కలిగిన ఉంటారు.. అత్యంత కఠిన శిక్షణ పొందిన వారు ఇందులో ఉంటారు.
