
హైదరాబాద్, వెలుగు: కొత్తగా ఓటు నమోదు కోసం దాదాపు 17 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోని 4 జిల్లాల నుంచే 7.15 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ఓటరు ఐడీ కార్డులో సవరణ, అడ్రస్ మార్పు కోసం 11.80 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఓటరు ఐడీ కార్డులో సవరణ కోసం ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు గతంలో ఎన్నడూ రాలేదని సీఈఓ తెలిపారు. ఓటర్ల జాబితాను సరిగ్గా రూపొందించేందుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తహసీల్దార్, ఇద్దరు నాయబ్ తహసీల్దార్‌లతో కూడిన 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.