72 శాతం మందికి కంటి సమస్యల్లేవ్: హరీశ్​రావు

72 శాతం మందికి కంటి సమస్యల్లేవ్: హరీశ్​రావు

 

  • కోటి 17 లక్షల మందికి కంటి వెలుగు స్క్రీనింగ్
  • 72 శాతం మందికి కంటి సమస్యల్లేవ్: హరీశ్​రావు
  • 41 రోజుల్లో అన్ని జిల్లాల్లో పూర్తి చేయాలని టార్గెట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 8351 గ్రామ పంచాయతీల్లో అంటే 66 శాతం పంచాయతీల్లో కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పూర్తయ్యిందని హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు తెలిపారు. 2,768 వార్డుల్లో అంటే మున్సిపాలిటీల్లో 80.23 శాతం పూర్తయిందన్నారు. ఆదివారం మంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా కంటి వెలుగుపై సమీక్షించారు. ఇప్పటి వరకు కోటి 17 లక్షల 75 వేల 604 మందికి స్క్రీనింగ్ చేసినట్లు తెలిపారు. ఇది టార్గెట్​లో 74.22 శాతానికి సమానమన్నారు. ఇప్పటి వరకు 15లక్షల 86 వేల మందికి రీడింగ్ గ్లాసెస్, 9.95 లక్షల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ ఇచ్చినట్లు తెలిపారు. దాదాపు 72 శాతం మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని స్పష్టమవుతుందన్నారు. పరీక్షలు చేసి, అవసరమైన వారికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేయడంలో ముందున్న హన్మకొండ, వికారాబాద్ జిల్లాల డీఎంహెచ్వోలు, సిబ్బందిని మంత్రి అభినందించారు. మరో 41 రోజుల్లో అవసరమైన ప్రతి ఒక్కరికి కంటి వెలుగు సేవలు చేరువయ్యేలా చూడాలన్నారు. ఆయా జిల్లాల్లో పూర్తి చేసేలా డీఎంహెచ్ వోలు ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని ఆదేశించారు. కోర్టులు, జైళ్లు, పోలీసు, ప్రెస్, ఆర్టీసీ వారి కోసం నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంపుల్లో ఇప్పటి వరకు 26,380 మందికి స్క్రీనింగ్ నిర్వహించగా, అవసరమైన 9695 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు.

సీపీఆర్ ట్రైనింగ్ వేగవంతం చేయాలి

సీపీఆర్ ట్రైనింగ్​ను స్పీడప్ చేయాలని హరీశ్ ఆదేశించారు. ప్రజలతో నిత్యం సంబంధం ఉండే ఆరోగ్య సిబ్బంది, పోలీసు, మున్సిపల్, పంచాయతీ ఇతర సిబ్బందికి ఇప్పటి వరకు 73,370 మందికి సీపీఆర్ శిక్షణ పూర్తి చేయడం జరిగిందని, మిగతా వారికి కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. శిక్షణ పూర్తి కాని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల సహకారంతో సత్వరం పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో మాల్ ఓనర్స్, మార్కెట్ కాంప్లెక్స్ అసోసియేషన్స్, ట్రేడ్ అసోసియేషన్స్ లకు, కాలేజీ విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వాలన్నారు. మహిళల సమగ్ర ఆరోగ్యం కోసం ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నిర్వహించాలని, డీఎంహెచ్​వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు ఆ రోజు దగ్గరుండి మానిటరింగ్ చేయాలన్నారు. చికిత్స అవసరం ఉన్న మహిళలను పై ఆసుపత్రులకు రిఫర్ చేసి, వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ఈ రివ్యూలో కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, అధికారులు పాల్గొన్నారు.