ప్రభుత్వ, సింగరేణి భూముల ఆక్రమణ

ప్రభుత్వ, సింగరేణి భూముల ఆక్రమణ
  • పొలిటికల్​ లీడర్ల హస్తం

మందమర్రి,వెలుగు: ఏజెన్సీలో రియల్​దందా జోరుగా సాగుతోంది. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో అక్రమార్కులు 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ, సింగరేణి భూములను కబ్జాచేసి ఇండ్లు, కమర్షియల్​ బిల్డింగ్స్​కడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే నజరానాలతో నోరుమూయించాలని చూస్తున్నారు. అయినా వినకపోతే  బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాడులకు తెగబడుతున్నారు. దందాలో రాజకీయ, కార్మిక సంఘాల లీడర్లు ఉన్నారు.

1/70 చట్టంపై పట్టింపు ఏది?

గిరిజనులకు రక్షణ కల్పించేందుకు ఏజెన్సీ ఏరియాలో 1/70 చట్టం అమలవుతోంది. దీంతో గిరిజనేతరులకు భూ బదలాయింపు చేయరాదు. ఏ లావాదేవీలు జరిగినా.. గిరిజనులు.. గిరిజనులకు మధ్యే జరగాలి. అయితే కొంత మంది లీడర్లు గిరిజనులను ముందుంచి తెలివిగా భూమిని కొంటున్నారు. కాగితాలపై క్రయవిక్రయాలు కొనసాగిస్తున్నారు.

పర్మిషన్ లేకున్నా నిర్మాణాలు...

మందమర్రిలో చాలాచోట్ల  అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాలు పూర్తయ్యే వరకు మౌనంగా ఉంటున్న మున్సిపల్​ ఆఫీసర్లు.. ఆ తర్వాత వాళ్ల నుంచి పన్నులు వసూలు చేసి ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారు. పట్టణంలోని సర్వే నెంబరు 148లో 163.22 ఎకరాల భూమిని 2016 సెప్టెంబరు లో సింగరేణి సంస్థ రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఇందులో 130 ఎకరాలకుపైగా జాగా ఆక్రమణకు గురైంది. స్థానిక మార్కెట్​ఏరియాలో సింగరేణి సంస్థ కొంత మంది వ్యాపారులకు క్వార్టర్లను లీజ్​కు ఇచ్చింది. కాలపరిమితి అయిపోయినా వారు క్వార్టర్లను తిరిగి సంస్థకు అప్పగించలేదు. యాజమాన్యమూ పట్టించుకోలేదు. దీంతో ఇప్పడు అక్కడ భారీ షాపింగ్​కాంప్లెక్స్​కట్టేశారు. బురదగూడెంలో మూసివేసిన ప్రభుత్వ స్కూల్ స్థలాన్ని లీడర్లు కొందరు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రగుంటపల్లికి వెళ్లే మార్గంలోని రియల్​ ​ వెంచర్ ​ ఏర్పాటు చేస్తున్నారు. 

గిరిజనుల భూములు, పల్లెల్లో రియల్ దందా...

మందమర్రి, కాసిపేట, చెన్నూరు ప్రాంతాల్లో అక్రమార్కులు చెరువు శిఖం, సీలింగ్ భూములను కబ్జాచేస్తున్నారు. క్యాతన్​పల్లి, గద్దెరాగడి, నస్పూర్, జైపూర్, చెన్నూరు, బెల్లంపల్లి, వేంపల్లి, ముల్కల, రాపల్లి, గుడిపేట, హాజీపూర్, దోనబండ, లక్సెట్టిపేట గ్రామాల్లో జాతీయ రహదారికి పక్కన ఉన్న భూములను ప్లాట్లుగా మార్చుతున్నారు. గోదావరి సరిహద్దు గ్రామాల్లో వాగులు, చెరువులు, ఒర్రెలను ఆనుకొని ఉన్న భూములనూ ప్లాట్లుగా మార్చుతున్నారు. వెంచర్ల కోసం శ్రీరాంపూర్ ఓసీపీ నుంచి మట్టిని తరలించి లక్షలు దండుకుంటున్నారు. 

ముఠాలుగా ఏర్పడి దందా…

గద్దెరాగడి, మందమర్రి, బెల్లంపల్లి, నస్పూర్, జైపూర్, చెన్నూరు, మంచిర్యాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. గోదావరిఖనికి చెందిన శివ, శంకర్​పేరుతో ఒకరు తాను మానవ హక్కుల సంఘం లీడర్, చాంబర్​ఆఫ్​ కామర్స్ మెంబర్​ అంటూ వివాదాస్పద భూములను సెటిల్​మెంట్​ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్యాతన్​పల్లి శివారులోని సర్వే 59లో ఓ భూమి వ్యవహారంలో ఏకంగా యాజమానిని కిడ్నాప్​  చేసేందుకూ యత్నించారు. స్థానిక శ్రీనివాస్​ గార్డెన్​ఏరియాలో మాట వినలేదని ఓ ఇంటిని రెవెన్యూ ఆఫీసర్లతో కలిసి కూల్చివేయించినట్లు ఆరోపణలున్నాయి.  సుమారు 20కిపైగా కేసులున్న ఓ రియల్​ఎస్టేట్ వ్యాపారి తాను మంచిర్యాల ఏసీసీకి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటూ దందా సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఎలాంటి పర్మిషన్లు లేవు

మందమర్రి పట్టణం ఏజెన్సీ ప్రాంతం కావడంతో భూమికి సంబంధించిన క్రయవిక్రయాలకు అనుమతిలేదు. నిర్మాణాలకు   పర్మిషన్లు ఇవ్వడంలేదు. ఏజెన్సీ భూముల్లో రియల్​ఎస్టేట్​ వ్యాపారం చేయడం నేరం. అక్రమ నిర్మాణాలు,12 వెంచర్లపై నోటీసులు ఇచ్చాం. – -గద్దె రాజు, మున్సిపల్ కమిషనర్, మందమర్రి