
హైదరాబాద్, వెలుగు: పోడు భూములకు ఇచ్చే పట్టాల లిస్టులో రాష్ట్ర సర్కార్ నాన్ ట్రైబల్స్‌ను కూడా చేర్చింది. దాదాపు 4.50 లక్షల ఎకరాల పోడు భూమిని 1.79 లక్షల మంది గిరిజనేతరులు సాగు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వారికి సంబంధించిన జాబితాను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి పంపగా.. పోడు పట్టాల లిస్టులో వారి పేర్లను చేర్చారు. ఇప్పటికే పట్టాల ప్రింటింగ్ మొదలవ్వగా, సీఎం ఆదేశాలకు తగ్గట్టు త్వరలోనే పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. పోడు పట్టాల లిస్టులో నాన్ట్రైబల్స్ఉండటంపై గిరిజనులు, ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ఉంటే.. తమకు ఉండే హక్కులు, ప్రత్యేకమైన సదుపాయాలు కోల్పోవాల్సి వస్తుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
11.50 లక్షల ఎకరాలకు పట్టాలిస్తామన్న సీఎం
రాష్ట్రంలో 11.50 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిస్తామని ఇటీవల అసెంబ్లీ బడ్జెట్సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులో దాదాపు 7 లక్షల ఎకరాలు గిరిజనులు పోడు చేసిన భూమి ఉండగా, మిగిలినది నాన్ ట్రైబల్స్ చేస్తున్నట్లు నిర్ధారించారు. మొదట పోడు పట్టాల కోసం 2021 నవంబర్లోనే అప్లికేషన్లు తీసుకున్నారు. చివరికి ఇటీవల ఫారెస్ట్, ట్రైబల్, రెవెన్యూ డిపార్ట్మెంట్ల ఆఫీసర్ల కమిటీలు అప్లికేషన్లు పరిశీలించాయి. గ్రామసభల్లో తీర్మానాలు చేయించారు. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కావడంతో త్వరలోనే పట్టాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
పూటకో చిచ్చు
పోడు భూములపై రాష్ట్ర సర్కార్ పూటకో చిచ్చు పెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రాకముందు నుంచే పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెబుతూ వచ్చింది. పోడు అప్లికేషన్లు తీసుకున్న ఏడాదికి ప్రాసెస్మొదలుపెట్టింది. ఓవైపు పట్టాలు ఇస్తామని చెబుతూనే.. మరోవైపు హరితహారం, ట్రెంచ్‌లు కొడుతుండడంతో నిత్యం గిరిజనులు, అటవీ అధికారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్ పై కొందరు గొత్తికోయలు దాడి చేసి హత్య చేయడంతో ఇది మరింత ముదిరింది. ఇక గ్రామాల్లో మళ్లీ పోడు కొట్టబోమని చెబుతూ అండర్‌టేకింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం కొత్త కిటుకు పెట్టింది. దీనిపైనా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు నాన్ ట్రైబల్స్‌ను కూడా పట్టాల లిస్ట్‌లో చేర్చడంతో ట్రైబల్స్‌కు, నాన్ ట్రైబల్స్‌కు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.
పట్టాల జారీకి రూల్స్ ఇవీ...
మొత్తంగా పోడు భూములకు హక్కు పట్టాల కోసం 4.14 లక్షల మంది నుంచి 12.14 లక్షల ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయి. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం 2005 డిసెంబర్ కంటే ముందు అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజనులందరికీ భూమిపై హక్కు కల్పిస్తూ పత్రాలివ్వాలి. ఇక గిరిజనేతరులైతే మూడు తరాల వారు ఆక్రమణలో ఉన్నట్లు ఆధారాలు చూపించాలి. అంటే 2005కు ముందు 75 సంవత్సరాలుగా (మూడు తరాలు) సాగు చేసుకుంటున్నోళ్లు అర్హులు. అయితే నాన్ ట్రైబల్స్‌కు సంబంధించి నిరూపించుకునేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో ఏపీ ప్రభుత్వం మాదిరి ఈ విషయంపై కేంద్రానికి వివరాలు పంపి, వారికి కూడా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చే దానిపై అనుమతి కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే తమ చేతిలో ఏం లేదని.. అంతా కేంద్రంపై నెపం పెట్టే ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి.